కలం, జోగులాంబ గద్వాల : ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు పంపిణీ చేసిన ఉచిత యూనిఫాంల (Student Uniforms) నాణ్యతపై సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రంగన్న, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రవీణ్, నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. నాసిరకం వస్త్రాలతో దుస్తులు కుట్టించారని, సరైన కొలతలు పాటించకపోవడంతో విద్యార్థులకు సరిపోవడం లేదని ఆరోపించారు.
ఈ సందర్భంగా సోమవారం ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్ బి.నర్సింగరావుకు ఫిర్యాదు చేశారు. నాసిరకం యూనిఫాంలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, వాటిని వెంటనే మార్చి నాణ్యమైన దుస్తులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకుడు వెంకటేష్, డీఎస్పీ నాయకుడు కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.

