గోదావరి పుష్కరాలు.. మంత్రి అడ్లూరి కీలక ఆదేశాలు

కలం, వెబ్ డెస్క్: గోదావరి పుష్కరాలు -2027 (Godavari Pushkaralu 2027)కు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Minister Adluri Laxman) ఆదేశించారు. జూన్‌ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి పుష్కరాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో సచివాలయంలో జగిత్యాల జిల్లా ధర్మపురి తదితర ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై ఆయన సమీక్షించారు. అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయడంతోపాటు, పూర్తయిన పనుల నాణ్యతను పరిశీలించాలన్నారు. మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సూచించారు.

అధికారులు సమన్వయం చేసుకోవాలి..

ఈ సందర్భంగా మంత్రి అడ్లురి మాట్లాడుతూ.. గోదావరి పుష్కరాలు రాష్ట్రానికి ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా ఎంతో ప్రాధాన్యమైనవని అన్నారు, ధర్మపురి వంటి పుణ్యక్షేత్రాలకు రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్దఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో భక్తుల రాకపోకలకు అనుగుణంగా రహదారులు, పుష్కర ఘాట్లు, పార్కింగ్‌ స్థలాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్తు, వైద్య సదుపాయాలు, మరుగుదొడ్లు, స్నాన గదులు తదితర మౌలిక వసతులను సమగ్రంగా కల్పించాలని సూచించారు. పుష్కరాల పనుల్లో ఇరిగేషన్‌, పంచాయతీరాజ్‌, రోడ్లు-భవనాలు (ఆర్‌అండ్‌బీ), దేవాదాయ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని చెప్పారు.

పనుల నాణ్యతలో రాజీ వద్దు..

పుష్కరాల కోసం చేపడుతున్న ప్రతి పనికి సంబంధించి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని మంత్రి సూచించారు. పూర్తయిన పనుల వివరాలు, ప్రస్తుతం కొనసాగుతున్న పనుల పురోగతి, ఇంకా ప్రారంభం కావాల్సిన పనులు, వాటి అంచనా వ్యయం, పూర్తి చేయాల్సిన గడువులతో కూడిన నివేదికను సిద్ధం చేయాలన్నారు. ప్రత్యేకించి పుష్కర ఘాట్ల వద్ద మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, చిన్నపిల్లలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని, అత్యవసర వైద్య సేవలు, అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్‌ నియంత్రణ, వాహనాల పార్కింగ్‌, భక్తుల రాకపోకలకు ప్రత్యేక మార్గాల రూపకల్పనపై దృష్టి సారించాలని సూచించారు.

ధర్మపురి అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం..

గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ధర్మపురి, కోటిలింగాల ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని అడ్లూరి తెలిపారు. పుష్కరాల కోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.1,000 కోట్ల నిధులు కేటాయించినట్లు ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు. ధర్మపురి ప్రాంతంలో సుమారు రూ.226 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టే ప్రణాళికలో భాగంగా పుష్కర ఘాట్లు, రహదారులు, పార్కింగ్‌ తదితర సదుపాయాల కల్పనకు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ధర్మపురిలో సుమారు 470 మీటర్ల మేర కొత్త స్నాన ఘాట్ల అభివృద్ధి కూడా ప్రతిపాదిత పనుల్లో ఉందని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>