కలం, కరీంనగర్ బ్యూరో: సీఎంఆర్ ధాన్యాన్ని ప్రక్క దారి పట్టించిన 40 మంది మిల్లర్ల పై చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కు సీపీఐ నేతలు వినతి పత్రం అందజేశారు. కరీంనగర్ (Karimnagar) జిల్లాలో సీఎంఆర్ టెండర్ ధాన్యం బకాయిపడి డిఫాల్టర్లైన రైస్ మిల్లర్ల (Rice Millers)పై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వారి ఆస్తులతో పాటు శూరిటీలుగా ఉన్న వారి ఆస్తులను కూడా జప్తు చేయాలని సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి (Chada Venkat Reddy) డిమాండ్ చేశారు.
గురువారం కరీంనగర్ జిల్లాలో 40 మందికి పైగా రైస్ మిల్లర్స్ సీఎంఆర్ ధాన్యాన్ని ప్రక్క దారి పట్టించి కోట్లాది రూపాయలు సొమ్ముచేసుకున్నారని చాడ వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ తో కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ.. 250 కోట్ల రూపాయలకు పైగా మిల్లర్లు ప్రభుత్వానికి బకాయి ఉన్నారనే సమాచారం తెలుస్తుందని అన్నారు.
డిఫాల్టర్ల నుండి ప్రజాధనాన్ని రికవరీ చేయడానికి రెవెన్యూ అధికారులు నామమాత్రంగా నోటీసులు ఇచ్చి వదిలేస్తున్నారని మండిపడ్డారు. చట్ట ప్రకారం డిఫాల్టర్ల ఆస్తులు జప్తు చేయాలని, మిల్లర్లకు సివిల్ సప్లై కార్పొరేషన్ కు మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం డిఫాల్టర్లకు షూరిటీగా ఉన్న వారి ఆస్తులను కూడా జప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
జిల్లావ్యాప్తంగా ఏ రైస్ మిల్లు నైనా రిజిస్ట్రేషన్ చేయాలంటే అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) ఎన్ఓసీ అవసరముంటుందని చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని మూడు సంవత్సరాలలో పలుమార్లు జిల్లా రిజిస్ట్రార్‌కు కూడా అడిషనల్ కలెక్టర్ లేఖ రాశారని.. కానీ జిల్లాలో డిఫాల్ట్ గా ఉన్న ఇద్దరు మిల్లర్లు మిల్లులను అమ్ముకున్నారని అన్నారు. చొప్పదండిలోని శ్రీ శ్వేత రైస్ మిల్లు యజమాని రూ.5 కోట్ల మేరకు బకాయి ఉన్నప్పటికీ ఎలాంటి ఎన్ఓసీ లేకుండా రెండేళ్ల క్రితం వేరొకరికి రిజిస్ట్రేషన్ చేశారని మండిపడ్డారు.
అలాగే కరీంనగర్ రూరల్ మండలం గోపాల్ పూర్ లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ట్రేడర్స్ కేరాఫ్ ఆదిత్య ఇండస్ట్రీస్ యజమానింప్రభుత్వానికి 2022- 2023 సంవత్సరానికి 6.19 కోట్ల బకాయి ఉందన్నారు. ఇది కూడా ఎలాంటి ఎన్ఓసి లేకుండానే వేరొకరికి అమ్మరని, జిల్లా సబ్ రిజిస్ట్రార్ కూడా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేశారని, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకుని బకాయిదారులంతా హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిలు తెచ్చుకుని అరెస్టులనుంచి తప్పించుకొని ఎదేచ్ఛగా తిరుగుతున్నారని వెంకట్ రెడ్డి మండిపడ్డారు. జిల్లా ఉన్నతాధికారులు, ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకొని డిఫాల్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు. వారి ఆస్తులను వెంటనే జప్తు చేయాలన్నారు. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందించిన వారిలో సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సురేందర్ రెడ్డి, న్యాలపట్ల రాజు, జిల్లా కౌన్సిల్ సభ్యులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు నునావత్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

