కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం పట్టణంలో వినియోగదారులను మోసం చేస్తూ తక్కువ తూకంతో బియ్యం విక్రయిస్తున్న దుకాణాలపై పౌరసరఫరాలు, లీగల్ మెట్రాలజీ అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం ఖమ్మం నగరంలోని పలు కిరాణా, రైస్ స్టోర్లలో అధికారులు సంయుక్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల వివరాలను జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్ వెల్లడించారు. తనిఖీల్లో పలు దుకాణాల్లో బియ్యం బస్తాలపై ముద్రించిన బరువు కంటే వాస్తవ బరువు తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై లీగల్ మెట్రాలజీ చట్టం ప్రకారం జరిమానాలు విధించడంతో పాటు, తక్కువ బరువు ఉన్న బియ్యం బస్తాలను (Underweight Rice Bags) స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
ఈ తనిఖీల్లో మామిళ్లగూడెంలోని లక్ష్మీ వేంకటేశ్వర కిరాణా & జనరల్ మర్చంట్‌లో రూ.18 వేల విలువైన 12 బస్తాలను, శ్రీ లక్ష్మీ బాలాజీ కిరాణా & జనరల్ స్టోర్‌లో రూ.28,500 విలువైన 15 బస్తాలను సీజ్ చేశారు. అలాగే కస్బా బజార్‌లోని షేక్ జానీమియా రైస్ స్టోర్స్‌లో రూ.7,500 విలువైన 5 బస్తాలను, సుపీరియర్ ఎంటర్‌ప్రైజెస్‌లో రూ.42 వేల విలువైన 21 బియ్యం బస్తాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా నాలుగు దుకాణాల్లో కలిపి రూ.96 వేల విలువైన 53 బియ్యం బస్తాలను సీజ్ చేసినట్లు పౌరసరఫరాల అధికారి తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా ఈ తనిఖీలు ఈసారికే పరిమితం కాకుండా నిరంతరం కొనసాగుతాయని పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్ స్పష్టం చేశారు. బియ్యం బస్తాలపై ముద్రించిన తూకం ప్రకారమే విక్రయాలు జరపాలని, తూకంలో తేడాలు ఉంటే ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులను హెచ్చరించారు. వినియోగదారులకు సరైన పరిమాణంలో సరుకులు అందేలా చూడటానికి జిల్లాలోని వ్యాపారులందరూ అధికారుల తనిఖీలకు పూర్తిగా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

