సంగారెడ్డి కాంగ్రెస్‌లో సెగలు.. డీసీసీ చీఫ్‌కు సవాళ్లు!

క‌లం, మెద‌క్ బ్యూరో: జిల్లాలో తీవ్ర పోటీ మ‌ధ్య అధ్య‌క్ష‌ప‌ద‌వి వ‌చ్చింది. పదవి వచ్చిందని సంతోష‌ప‌డేలోపే ఆ నియామ‌కం పార్టీలో పెను వివాదానికి ప్ర‌ధాన కారణ‌మైంది. ఒక వైపు జిల్లా మంత్రి ఆగ్ర‌హం.. మ‌రోవైపు ఆశావాహుల నుండి స‌హాయ నిరాక‌ణ.. సంగారెడ్డి జిల్లా డీసీసీ (Sangareddy DCC) అధ్య‌క్షుడిగా ఎన్నికైన ప‌ట్లోళ్ల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి (Patlolla Chandrasekar Reddy)కి స‌వాలుగా మారుతోంది. పార్టీని బ‌లోపేతం చేద్దామ‌నుకుంటే తాజా వివాదాలు, క్షేత్ర స్ధాయి ప‌రిస్ధితులు ఆయ‌న బాధ్య‌త నిర్వ‌హ‌ణ‌కు అడ్డంకులు సృష్టించేలా క‌నిపిస్తున్నాయి. దేవుడు వ‌ర‌మిచ్చినా పూజారి క‌రుణించలేదు అన్న‌ట్లు, హైక‌మాండ్ మ‌ద్ద‌తునిచ్చినా జిల్లా నాయ‌కుల‌ ఆశీస్సులు, మ‌ద్ద‌తు కోసం చూడాల్సిన పరిస్థితి నెల‌కొంది. ఎన్నో స‌వాళ్ల మ‌ధ్య అధ్య‌క్ష ప‌ద‌వి ఆయ‌న‌కు క‌త్తిమీద సాములా మారింది.

అధిష్టానం ఆశీస్సుల‌తో..

సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్య‌క్ష‌ పదవి నియామకం సంవత్సరం నుండి వాయిదా పడుతూ వచ్చింది. ఈ పదవికి జహీరాబాద్‌కు చెందిన ఉజ్వల్‌రెడ్డి, పటాన్‌చెరుకు చెందిన కాటా సుధారాణి, ఎమ్మెల్యే సంజీవరెడ్డి సోదరుడు చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపీ సురేష్‌ షెట్కార్‌ సోదరుడు నగేష్‌ షెట్కార్‌తో పాటు మరికొందరు తీవ్రంగా పోటీ పడ్డారు. మంత్రి దామోదర రాజనర్సింహా ఆశీస్సులు ఉండటం, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డితో సహా నేతల మద్దతు ఉండటంతో ఉజ్వల్‌రెడ్డికి దాదాపు ఖారరైందన్న ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో డీసీసీ ప‌ద‌వి కోసం తీవ్ర పోటీ, ఏకాభిప్రాయం రాక‌పోవ‌డంతో నియామకాన్ని వాయిదా వేశారు. గ‌తేడాది నవంబ‌ర్‌లో రాష్ట్రంలోని మిగతా జిల్లాల అధ్యక్షులను ప్రకటించినా సంగారెడ్డి జిల్లాను మాత్రం పెండింగ్‌లో పెట్టారు. ఆ తరువాత డీసీసీ అధ్యక్షురాలిగా నిర్మలా జగ్గారెడ్డి కొన‌సాగారు. అయితే సెప్టెంబ‌ర్ 19వ‌ తేదీన ఎవ‌రూ ఊహించ‌ని విధంగా నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే సంజీవరెడ్డి త‌మ్ముడు చంద్రశేఖర్ రెడ్డిని డీసీసీ అధ్యక్షుడిగా నియామ‌కం చేస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామ‌కం మంత్రితో పాటు, జిల్లా ముఖ్య‌నేత‌ల‌కు షాక్‌కు గురి చేసింది. జిల్లా మంత్రి ఆశీస్సులు లేకున్నా, జిల్లాలో మెజార్టీ నేతల మద్దతు లేకున్నా.. చంద్రశేఖర్ రెడ్డికి డీసీసీ పీఠం ఎలా ద‌క్కించుకున్నాడ‌నే చ‌ర్చ న‌డిచింది. త‌న‌కు ఉన్న అన్ని ర‌కాల ప‌రిచ‌యాల‌ను ఉప‌యోగించి, ఢిల్లీ స్దాయిలో చ‌క్రం తిప్పి హైకమాండ్ ద్వారా ఈ ప‌దవి సాధించ‌డంతో చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి స‌ఫ‌లం అయ్యాడు.

వివాదం రాజేసిన‌ ఢిల్లీ ఘ‌ట‌న‌

మంత్రి దామోదర రాజనర్సింహా ఆశీస్సులు లేకుండా చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి నియామ‌కం జ‌ర‌గ‌డ‌మే రాష్ట్ర కాంగ్రెస్‌లో పెద్ద వివాదానికి కార‌ణ‌మైంది. ఈ నియామ‌క‌మే ఢిల్లీ వేదికగా మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహా, కామారెడ్డి జిల్లా జుక్క‌ల్ ఎమ్మెల్యే తోట ల‌క్ష్మీ కాంతారావు మ‌ధ్య వివాదానికి దారితీసింది. చంద్ర‌శేఖ‌ర్ రెడ్డికి ప‌ద‌వి ఇప్పించ‌డంలో జుక్క‌ల్ ఎమ్మెల్యే స‌హాయం చేశార‌న్న‌ భావ‌న‌తో ఆయ‌న ఢిల్లీ హోట‌ల్ లాబీలో ఎదురుప‌డిన సంద‌ర్భంగా “అస‌లు ఏమనుకుంటున్నావ్.. డీసీసీలు ఇప్పిస్తున్నావట.. నీకు ఎవడికంటే వాడికి ఇప్పిస్తావా? నువ్వేమైనా పెద్ద సుల్తానా అనుకుంటున్నావా? అన్ని మంత్రి దామోద‌ర అన్న‌ట్లు ప్ర‌చారం జ‌రగ‌డంతో రాష్ట్ర రాజ‌కీయాల్లో దూమారం రేగింది. చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి నియామ‌కం ప‌ట్ల మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహా మాత్ర‌మే కాకుండా జిల్లా, నియోజ‌క‌వ‌ర్గ‌ ముఖ్య‌నేతలు అసంతృప్తిగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. త‌న‌ సొంత జిల్లాలో డీసీసీ అధ్యక్ష పదవిని త‌న అనుచ‌రుల‌కు ఇప్పించుకోక‌పోవ‌డంతో మంత్రి దామోద‌ర ఆగ్ర‌హంగా ఉన్నట్టు తెలుస్తోంది. నియామ‌క‌ ఉత్తర్వులు వచ్చేంత వరకు జిల్లా ముఖ్య నేతలకు సమాచారం లేదని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. ఒకే ఇంట్లో ఎమ్మెల్యేగా, జిల్లా అధ్యక్షుడిగా పదవులు ఇవ్వడంపై పలువురు నేతలు అసంతృప్తిగా ఉన్నారు. 2018 ఎన్నిక‌ల్లో టికెట్ రాక‌పోతే బీజేపీ పార్టీలో చేరి.. పోటీ చేసిన ప‌ట్లోళ్ల‌ సోద‌రుల‌కు వ‌రుస‌గా అవ‌కాశాలు క‌ల్పించ‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. పార్టీ మారిన కుటుంబానికి ప‌దవులు ఇస్తుంటే కాంగ్రెస్ పార్టీనే న‌మ్ముకున్నవారికి అన్యాయం జ‌రుగుతోంద‌ని కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

స‌హాయ నిరాక‌ర‌ణ త‌ప్ప‌దా..?

ప్ర‌సుత్తం జ‌రుగుతున్న రాజ‌కీయ‌ ప‌రిణామాల‌తో చంద్ర‌శేఖ‌ర్ రెడ్డికి సంగారెడ్డి జిల్లా హ‌స్తం నాయ‌కుల నుండి సహాయ స‌హ‌కారాలు అందుతాయో లేదోన‌న్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. మంత్రి దామోదర రాజనర్సింహా డీసీసీ అధ్య‌క్షుడి నియామ‌కం ప‌ట్ల బ‌హిరంగంగా అసంతృప్తి వ్య‌క్తం చేయ‌డం చంద్ర‌శేఖ‌ర్ రెడ్డిని ఇరుకున పెడుతోంది. చంద్రశేఖర్ రెడ్డికి పదవి దక్క‌డంతో అధ్య‌క్ష పోటీలో ఉన్న మిగ‌తా ఆశావాహులు షాక్‌కు గుర‌య్యారు. ఆశావాహుల‌ నుండి మ‌ద్దతును సాధించే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. సంగారెడ్డి జిల్లాలోని ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో అధ్య‌క్షుడిగా చంద్ర‌ శేఖ‌ర్ రెడ్డికి భ‌విష్య‌త్తులో ఇబ్బందిక‌ర ప‌రిస్ధితులు ఎదురుకానున్నాయి. అధ్య‌క్ష పోటీతో మంత్రి మద్ద‌తునిచ్చిన ఉజ్వ‌ల్ రెడ్డి జ‌హీరాబాద్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం వ్య‌క్తి కాగా, ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జిగా ఉన్న కాటా శ్రీనివాస్ గౌడ్ మంత్రి దామోద‌ర అనుచ‌రుడు. సంగారెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో పిసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి ఉండ‌టంతో జిల్లా అధ్య‌క్షుడిగా సంగారెడ్డిలో చేసేదేమీ ఉండ‌దు. ఇక మంత్రి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న అందోల్ నియోజ‌క‌వర్గంలో పార్టీ కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ క‌ష్ట‌మే. ఇక మిగిలింది వాళ్ల అన్న సంజీవ్ రెడ్డి ప్ర‌తినిథ్యం వ‌హిస్తున్న నారాయ‌ణ ఖేడ్ నియోజ‌క‌వ‌ర్గం. ఇక్క‌డ కుడా ఎంపీ సురేష్ షెట్కార్ వ‌ర్గంతో విభేదాలు ఉన్నాయి. దీంతో జిల్లాలోని ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో ముఖ్య నాయ‌కులు చంద్ర‌శేఖ‌ర్ రెడ్డికి పూర్తిస్ధాయిలో స‌హాయ స‌హ‌కారాలు ఇచ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. దీంతో జిల్లాలో పార్టీని బ‌లోపేతం చేయ‌డం, పార్టీ కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ, పార్టీకి ప్ర‌భుత్వానికి మ‌ధ్య అనుసంధానం చేయ‌డమ‌నేది శేఖ‌ర్ రెడ్డికి పెనుస‌వాలుగా మార‌నుంది. అధ్య‌క్షుడిగా చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి కార్య‌క‌ర్త‌ల‌ను, నాయ‌కుల‌ను స‌మ‌న్వ‌యం చేయాల్సిన బాధ్య‌తతో పాటు, ప్ర‌తిప‌క్షాలపై రాజ‌కీయ పోరాటాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తాడో అని చ‌ర్చించుకుంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>