కమలనాథుల్లో చిచ్చుపెట్టిన ‘బండి’ హెచ్చరికలు

కలం,  ​కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) నగరపాలక సంస్థ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార బీజేపీకి చెందిన సొంత పాలకవర్గంపైన, కార్పొరేటర్ల పనితీరుపైన కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) చేసిన ఘాటు వ్యాఖ్యలు కమలదళంలో కలకలం రేపాయి. అవినీతికి పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదంటూ ఆయన ఇచ్చిన హెచ్చరికలు ఇప్పుడు స్థానిక రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ​సొంత పార్టీ కేంద్ర మంత్రే అవినీతిపై హెచ్చరికలు జారీ చేయడం పట్ల ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, తెలంగాణ రక్షణ సేన, సీపీఐ తదితర ప్రతిపక్ష పార్టీలకు ఇది ఒక శక్తివంతమైన అస్త్రంగా మారింది.

తడబడిన అడుగులు..

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌పై తొలిసారిగా కాషాయ జెండా ఎగురవేసి అధికారం చేపట్టిన నాటి నుంచి, పాలకవర్గ ప్రయాణం ఆశించిన స్థాయిలో లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ తరుణంలో బండి సంజయ్ వ్యాఖ్యలు బీజేపీని ఇరుకున పెట్టాయి.

​అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ మాటల తూటాలు ఇబ్బందుల్లోనే ఉన్నాయి. గతంలో మేయర్ పదవిని దక్కించుకున్న కొలగాని శ్రీనివాస్‌కు ప్రస్తుత పరిస్థితులు సవాల్‌గా మారాయి. ఎన్నికలకు ముందు మంజూరైన రూ.50 కోట్ల టెండర్లను రద్దు చేయడంలో కాంగ్రెస్ ముఖ్య నేత కీలక పాత్ర పోషించారని వార్తలు వినిపిస్తున్నాయి.

గాడి తప్పుతున్న ఆఫీస్ నిర్వహణ!

నగరంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరుగుతున్నప్పటికీ, కార్యాలయ నిర్వహణ మాత్రం గాడి తప్పిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. కార్పొరేటర్లు ఎవరికి వారుగా వ్యవహరిస్తున్న తీరు పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు దారితీస్తోందని అభిప్రాయపడుతున్నారు.

కొత్త జోష్.. కొత్త టెన్షన్..

మున్సిపల్ కార్పొరేషన్‌లో మూడింట రెండు వంతుల మంది కొత్త కార్పొరేటర్లే గెలుపొందారు. డివిజన్లలో ఉదయం నుంచి రాత్రి వరకు తిరుగుతూ పనులను పర్యవేక్షించడంలో వీరు ఆరాటపడ్డారు. అయితే మాజీ కార్పొరేటర్లపై ఆధిపత్యం ప్రదర్శించే క్రమంలో కొందరు, చేతివాటం ప్రదర్శించేందుకు మరికొందరు సిద్ధమయ్యారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. కార్పొరేటర్ల జోక్యం పెరగడంతో కాంట్రాక్టర్ల ప్రమేయం ఎక్కువైందనే చర్చ కూడా బలంగా నడుస్తోంది. తాజా పరిణామాలను బీజేపీ పాలకవర్గం తీవ్రంగా పరిగణించింది.

అవినీతి రహిత పాలనను అందించడమే తమ లక్ష్యమని నిరూపించుకునేందుకు కమలం పార్టీ ప్రత్యేక కార్యాచరణకు సిద్ధమవుతోంది. కేంద్ర మంత్రి హెచ్చరికల నేపథ్యంలో విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని, పారదర్శకతను పాటిస్తూ అభివృద్ధి పనుల్లో నాణ్యతపై స్పష్టతనిచ్చి ఆరోపణలకు చెక్ పెట్టాలని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>