మహిళలను కాంగ్రెస్‌ చిన్న చూపు చూస్తుంది: బండారి గాయత్రి

కలం, కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ మహిళలను చిన్న చూపు చూస్తుందని.. ఆ పార్టీలో మహిళా ప్రజాప్రతినిధులకు ఏమాత్రం గౌరవం లేదని బీజేపీ నాయకురాలు బండారి గాయత్రిదేవి (Bandari Gayathri) మండిపడ్డారు. నగరపాలక సంస్థ 9వ డివిజన్ కార్పొరేటర్ గా గెలిచిన మహిళను పక్కనపెట్టి ఆమె భర్తే కార్పొరేటర్ గా చెలామణి కావడం చట్ట వ్యతిరేకమని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన మహిళ గుర్తింపును ఆమె భర్త, కాంగ్రెస్ నాయకుడు పడిశెట్టి భూమయ్య కాలరాసేలా వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

కరీంనగర్ (Karimnagar) మున్సిపల్ కార్పొరేషన్ 9వ డివిజన్ (మహిళా రిజర్వ్‌డ్) స్థానంలో కాంగ్రెస్ కార్పొరేటర్ గా పడిశెట్టి వసంతలక్ష్మి విజయం సాధిస్తే, భర్త పడిశెట్టి భూమయ్య అనధికారికంగా కార్పొరేటర్ అవతారమెత్తి అధికారాలు చెలాయిస్తున్నారని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్, మున్సిపల్ ఉన్నతాధికారులకు బండారి గాయత్రి  ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గాయత్రి మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 9వ డివిజన్ నుంచి బీజేపీ అభ్యర్థిగా తాను పోటీ చేయగా, కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన పడిశెట్టి వసంత లక్ష్మి గెలుపొందారని గుర్తుచేశారు.

అయితే, ఆమె భర్త పడిశెట్టి భూమయ్య ఎలాంటి పదవికి ఎన్నికవ్వకపోయినా, నియమితుడు కాకపోయినా.. వివిధ పత్రికా ప్రకటనలలో, వార్తాకథనాలలో తనను తాను 9వ డివిజన్ కార్పొరేటర్‌గా ప్రచారం చేసుకుంటూ డివిజన్ ప్రజలను, అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. అధికారికంగా పడిశెట్టి భూమయ్యకు ఎలాంటి హోదా లేనప్పటికీ, ఉన్నట్లు నటిస్తూ మున్సిపల్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం, మున్సిపల్ పాలనలో జోక్యం చేసుకోవడం, అధికారుల ముందు, వివిధ కార్యక్రమాలలో కార్పొరేటర్‌గా ప్రాతినిధ్యం వహించడం లాంటి వ్యవహారాలుకొనసాగుతున్నాయని ఆమె ఆరోపించారు.

మహిళా ప్రజాప్రతినిధి, కార్పొరేటర్ గా వసంతలక్ష్మికి దక్కాల్సిన గౌరవము, హక్కులను ఆమె భర్త ఆక్రమించడం చట్ట విరుద్ధమని గాయత్రి స్పష్టం చేశారు. కేవలం వైవాహిక సంబంధం ఉన్నంత మాత్రాన భర్తకు కార్పొరేటర్‌గా ఎలాంటి స్వతంత్ర అధికారాలు ఉంటాయో  అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానంగా పడిశెట్టి భూమయ్యను కార్పొరేటర్‌గా గుర్తించవద్దని మున్సిపల్ ఉద్యోగులను ఆదేశించాలని, మున్సిపల్ పాలనలో అనధికారిక జోక్యాన్ని వెంటనే అరికట్టాలని అన్నారు. చట్టబద్ధమైన అధికారం లేకుండా కార్పొరేటర్‌గా ప్రచారం చేసుకుంటూ మున్సిపల్ పాలనలో జోక్యం చేసుకుంటున్న భూమయ్యపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, మున్సిపల్ ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>