కలం, నారాయణపేట: దామరగిద్ద మండలం కంసాన్ పల్లి (Kamsanpally) గ్రామంలో మద్యపాన నిషేధంపై గత నెల 2న జరిగిన గ్రామపంచాయతీ సమావేశంలో గ్రామపంచాయతీ సభ్యులు తీర్మానం చేసి ఆమోదించారు. గ్రామంలో మద్యం విక్రయం వల్ల యువకులు మద్యం సేవించి అనవసరమైన విషయాల్లో తల దూర్చడంతో గొడవలు జరుగుతున్నాయని మద్యపాన నిషేధంపై నిర్ణయం తీసుకున్నారు. గ్రామపంచాయతీ తీర్మానం ఉన్నప్పటికీ ఓ బీఆర్ఎస్ నేత ఎవరొస్తారో చూద్దాం.. మద్యం అమ్మండి.. కేసులు ఎవరు చేస్తారో నేను చూసుకుంటాను.. అంటూ హుకుం జారీ చేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
యువత మద్యానికి బానిసై చెడిపోతుంటే సదరు బీఆర్ఎస్ నేత మాత్రం మద్యం అమ్మండి అని హుకుం జారీ చేశారంటూ గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏ అధికారి అండతో బీఆర్ఎస్ నేత ఇలా మాట్లాడుతున్నాడు? అర్థం కావడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గత 15 రోజుల క్రితం మద్యం తాగడం వల్ల ఓ యువకుడిని సుమారు పది మంది యువకులు వెంటబడి కొట్టేందుకు ప్రయత్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కంసాన్పల్లి గ్రామానికి మద్యం ఇది వరకు దామరగిద్ద వైన్స్ నుంచి సరఫరా చేస్తుండే వారని.. ఎక్సైజ్ అధికారుల నుంచి తమ గ్రామానికి మద్యం సరఫరా చేయకుండా వైన్స్ నిర్వాహకులకు ఆదేశాలు రావడంతో దామరగిద్ద వైన్స్ నుంచి మద్యం సరఫరా నిలిచిపోయింది. దీంతో నారాయణపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ నేతకు సంబంధించిన వైన్స్ నుంచి భారీ ఎత్తున గ్రామానికి మధ్య సరఫరా చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామ పంచాయతీ తీర్మానం ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా మద్యం విగ్రహాలపై ఎక్సైజ్, పోలీస్ అధికారులు దృష్టి సారించాలని గ్రామస్తులు కోరుతున్నారు. లేని పక్షంలో గ్రామస్తులతో ఎక్సైజ్ కార్యాలయం ముట్టడికి సిద్దమవుతామన్నారు.

