కలం, కరీంనగర్: రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మానకొండూరు ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ (Kavvampally Satyanarayana) అన్నారు. బుధవారం బెజ్జంకి (Bejjanki) వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించిన ఏఎంసీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌గా మాతంగి శిరీష అనిల్, వైస్ చైర్మన్‌గా పర్ష సంతోష్ కుమార్‌తో పాటు డైరెక్టర్లు జిల్లా రాజేశ్వరి, దేశరాజు అనిల్, నందికొండ తిరుపతిరెడ్డి, మైసంపల్లి తిరుపతి, ఇస్కిల్ల ఐలయ్య, జీల లింగం, రెడ్డి రామకృష్ణారెడ్డి, మహమ్మద్ సాదిక్, కుంట హరికృష్ణ, ఎలకంటి శ్రీనివాస్ రెడ్డి, బోయినపల్లి కృష్ణారావు, గుండా వెంకట్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రకాష్ వీరితో ప్రమాణం చేయించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి మాట్లాడుతూ.. నూతన పాలకవర్గం రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. రైతుల పట్ల గౌరవభావంతో వ్యవహరిస్తూ, వారు కష్టాల్లో ఉన్నప్పుడు తక్షణమే స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. నియోజకవర్గంలోనే అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న బెజ్జంకి వ్యవసాయ మార్కెట్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు పాలకవర్గ సభ్యులంతా సమన్వయంతో పనిచేయాలని కోరారు. రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.
కష్టపడిన కార్యకర్తలకు తప్పక గుర్తింపు
పదవికి తగిన బాధ్యతతో కష్టపడి పనిచేస్తే తప్పకుండా గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్యే అన్నారు. 2014 నుంచి నేటి వరకు తన వెన్నంటి ఉండి గెలుపు కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు తాను ఎప్పటికీ కృతజ్ఞుడిగా ఉంటానన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి, ప్రజలను పార్టీ వైపు నడిపించడానికి కార్యకర్తల కృషి ఎంతో ఉందని కొనియాడారు.
గడపగడప కాంగ్రెస్ కార్యక్రమంలో మాతంగి అనిల్‌తో పాటు ఎంతోమంది కార్యకర్తలు తనతో కలిసి పనిచేశారని గుర్తుచేశారు. పార్టీ పరిస్థితులు క్లిష్టంగా ఉన్న సమయంలోనూ అనిల్ ఎంతో ధైర్యంగా తన వెన్నంటి నిలిచారని ప్రశంసించారు. పార్టీ కోసం ఆయన చేసిన కృషికి గుర్తింపుగానే ఆయన సతీమణి మాతంగి శిరీషకు ఏఎంసీ చైర్పర్సన్ పదవి దక్కిందని వివరించారు.
కష్టపడిన కార్యకర్తలకు పదవులు కల్పించడం కాంగ్రెస్ పార్టీలో ఆనవాయితీగా వస్తోందన్నారు. పదవులను ఆశించడంలో తప్పులేదని, అవకాశం రాని వారు నిరాశ చెందకుండా పార్టీ కోసం పనిచేస్తూ ముందుకు సాగాలని సూచించారు. నేడు కాకపోయినా ఏదో ఒక రోజు కష్టానికి తగిన గుర్తింపు తప్పకుండా లభిస్తుందని భరోసా ఇచ్చారు.
రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని ఎమ్మెల్యే కవ్వంపల్లి పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రైతులకు అందించిన ప్రాధాన్యతను గుర్తుచేస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే స్ఫూర్తితో రైతులకు మెరుగైన సేవలు అందిస్తున్నారని తెలిపారు. రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేయడంతో పాటు ఉచిత విద్యుత్, రుణాలు, ఎరువులు, విత్తనాలు అందిస్తున్నామని చెప్పారు.
గత పాలకులు పదేళ్ల పాలనలో పేదల సొంతింటి కలను సాకారం చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తూ పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని వివరించారు.
ఎమ్మెల్యేకు ఘన స్వాగతం.. భారీ ర్యాలీ
ఏఎంసీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు బెజ్జంకి వచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. కేడీసీసీ బ్యాంకు చౌరస్తా వద్ద నాయకులు, కార్యకర్తలు, నూతన పాలకవర్గ సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు. అక్కడి నుంచి భారీ జనసమూహం మధ్య మార్కెట్ యార్డు వరకు ర్యాలీ నిర్వహించారు. మార్గమధ్యంలోని అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎడ్లబండి చౌరస్తాలో గోమాత విగ్రహాలకు పూలమాలలు వేసి వందనం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ పులి కృష్ణ, మాజీ వైస్ చైర్మన్ చిలువేరు శ్రీనివాసరెడ్డి, బెజ్జంకి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నాంపల్లి శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్లు ఒగ్గు దామోదర్ (బెజ్జంకి), ఊట్కూరి వెంకటరమణ రెడ్డి (ఇల్లంతకుంట), మోరపెల్లి రమణారెడ్డి (నుస్తులాపూర్), ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి (ఊటూరు), మానకొండూరు ఏఎంసీ చైర్మన్ రేవెల్లి రాజలింగం, వైస్ చైర్మన్ రేమిడి శ్రీనివాసరెడ్డి, గన్నేరువరం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొడ్డు సునీల్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే పార్టీ నాయకులు ముస్కు ఉపేందర్ రెడ్డి, నందగిరి రవీంద్ర చారి, ముక్కిస రత్నాకర్ రెడ్డి, అక్కరవేణి పోచయ్య ముదిరాజ్, పనుల వెంకటి, జువ్వాడి మన్మోహన్ రావు, కొమ్మెర రవీందర్ రెడ్డి, బుర్ర తిరుపతి గౌడ్, గూడెల్లి శ్రీకాంత్, చెప్యాల శ్రీనివాస్ గౌడ్, శానగొండ శ్రావణ్, జెల్ల ప్రభాకర్, చింతల శ్రీధర్ రెడ్డి, ఉదయ్ రెడ్డి, కొరివి అరుణ్ కుమార్, కట్కం తిరుపతి, బండి మల్లేశం, గోపు మల్లారెడ్డి, మామిడి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

