కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచడంతో పాటు ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్య సేవలు అందేలా సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Khushboo Gupta) ఆదేశించారు. బుధవారం నవాబ్‌పేట మండలంలోని పోమాల్, తిమ్మాయపల్లి గ్రామాల్లో కలెక్టర్ పర్యటించారు. పారిశుద్ధ్య పనులు, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా పోమాల్ గ్రామంలో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కలెక్టర్ గ్రామస్తులతో మాట్లాడి నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పనులు సక్రమంగా జరగడం లేదని గ్రామస్తులు ఆమె దృష్టికి తీసుకురావడంతో సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పరిశుభ్రతను మెరుగుపరచాలని ఆదేశించారు.
అనంతరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలించారు. రెండో తరగతి గదిలో విద్యార్థులకు బోర్డుపై రాసిన తెలుగు అక్షరాలు, పదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఒక విద్యార్థినికి బోర్డుపై రాసిన అక్షరాలు సరిగా కనిపించకపోవడాన్ని గుర్తించిన కలెక్టర్, వెంటనే కంటి పరీక్షలు నిర్వహించాలని, అవసరమైతే ఆర్బీఎస్కే వైద్య బృందం ద్వారా పరీక్షలు చేయించాలని ప్రధానోపాధ్యాయుడికి సూచించారు. పాఠశాలలోని అన్ని తరగతి గదులను పరిశీలించి విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.
గ్రామంలో నీటి సరఫరా పైపులైన్లో లీకేజీని గుర్తించిన కలెక్టర్, ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉన్నందున ప్రతి నీటి బొట్టును పొదుపుగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పైపులైన్ లీకేజీలను వెంటనే అరికట్టి నీటి వృథాను నివారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని తనిఖీ చేశారు. అక్కడ విద్యుత్ సౌకర్యం, ఫ్యాన్లు, లైట్లు అందుబాటులో లేకపోవడాన్ని గమనించి అవసరమైన మౌలిక వసతులను తక్షణమే ఏర్పాటు చేయాలని సూచించారు. ఉపకేంద్రానికి వచ్చిన రోగులు, గర్భిణులతో మాట్లాడి వైద్య సేవలు, మందుల లభ్యత, టీకాల కార్యక్రమం అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ ఉపకేంద్రం పరిధిలో ఐదు గ్రామాలు ఉన్నాయని సిబ్బంది వివరించగా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ.. పోమాల్ గ్రామం గడ్డ కాలనీ లో మూడేళ్ల క్రితం నిర్మించిన అంగన్వాడీ భవనం ఇప్పటి వరకు ప్రారంభానికి నోచుకోలేదని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్ జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి జరీనా బేగంతో ఫోన్లో మాట్లాడి భవనం ప్రారంభానికి నోచుకోకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన చర్యలు వెంటనే చేపట్టి భవనాన్ని వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. తదుపరి తిమ్మాయపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ పిల్లలు, గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవలను పరిశీలించారు. కేంద్రానికి హాజరవుతున్న పిల్లల సంఖ్య, గర్భిణుల వివరాలను అడిగి తెలుసుకోవడంతో పాటు చిన్నారుల బరువును స్వయంగా పరిశీలించారు. కేంద్రంలో అందుబాటులో ఉన్న ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. పప్పులు, ఆకుకూరలు, గుడ్లు తదితర పోషకాహార పదార్థాల సరఫరా నిలిచిపోయిందని సిబ్బంది తెలపడంతో సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి కారణాలను తెలుసుకున్నారు. పోషకాహార సరఫరాలో అంతరాయం లేకుండా సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో గ్రామ సర్పంచ్ కవిత, ఉప సర్పంచ్ ఆంజనేయులు, ఇన్చార్జి పంచాయతీ కార్యదర్శి క్రాంతి కుమార్, జి.పి.ఓ రమేష్, వార్డు సభ్యులు సుమలత, నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.

