కలం, జోగులాంబ గద్వాల: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రీ సర్వే పనులను ఎలాంటి తగాదాలకు ఆస్కారం లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ మధుమోహన్ అన్నారు. మల్దకల్ మండలంలోని బూడిదపాడు (Budidapadu) గ్రామంలో కొనసాగుతున్న రీ సర్వే పనులను అదనపు కలెక్టర్ మధుమోహన్ బుధవారం క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా సర్వే పనుల పురోగతిని సమీక్షించారు. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహణ తీరును, సంబంధిత రికార్డులను పరిశీలించి, పనుల అమలులో ఎదురవుతున్న అంశాలపై అధికారులతో చర్చించారు. పునఃసర్వే ప్రక్రియను పారదర్శకంగా, సమన్వయంతో నిర్వహిస్తూ, నిర్దేశిత లక్ష్యాల మేరకు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. రీ సర్వేతో భూ తగాదాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సర్వేకు లైసెన్స్ సర్వేయర్ల సేవలను సమర్ధవంతంగా వినియోగించుకోవాలని తెలిపారు. ఈ పర్యటనలో సర్వే ఏడి నూకరాజు, మల్దకల్ తహశీల్దార్ ఝాన్సీ, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

