కలం, వెబ్ డెస్క్: ఎల్ నినో ప్రభావంతో హైదరాబాద్‌లో పలు చోట్ల మొదలైన నీటి కొరత (Hyderabad Water Shortage) సమస్య ప్రైవేట్ కాలేజీలపై ప్రభావం చూపిస్తోంది. తమ విద్యార్థులకు దీపావళి సెలవులను ప్రకటిస్తూ నారాయణ, శ్రీ చైతన్య కాలేజీలు మాదాపూర్, హైటెక్ బ్రాంచ్‌ల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించాయి. నీళ్ల ఇబ్బంది కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, దయచేసి తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలని కోరాయి. విద్యార్థులకు అకడమిక్ నష్టం జరగకుండా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తామని పేర్కొన్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదల చేస్తామని సహకరించాలని తెలిపాయి. తిరిగి కాలేజీలు ఎప్పుడు ప్రారంభించేది చెబుతామని ఆ ప్రకటనలో స్పష్టం చేశాయి.
మిగిలిన కాలేజీలు అదే దారిలో..?
హైదరాబాద్ నగరంలో నీటి ఇబ్బందులు (Hyderabad Water Shortage) రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే జలమండలి హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఇక్కట్లు తప్పేలా లేవని అర్థమవుతోంది. మాదాపూర్, కూకట్ పల్లి, మియాపూర్, బాచుపల్లి, నిజాంపేట్ ఏరియాల్లో పెద్ద ఎత్తున ప్రైవేట్ కాలేజీలున్నాయి. ఇక్కడ వేలాది మంది విద్యార్థులు కాలేజీ హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో వందల హాస్టళ్లకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడం సవాల్ గా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో రాబోయే రోజుల్లో మెజార్టీ కాలేజీలు ఆన్లైన్ బాటలో నడవక తప్పదని పేర్కొంటున్నారు.
Also Read : రాహుల్ జీ.. అక్రమ ఓట్లు తొలగిస్తే తప్పేంటి..? : బీజేపీ
Follow Us On : WhatsApp

