కలం, స్పోర్ట్స్ : వరుస వైఫల్యాలకు యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) బ్యాట్‌తో సమాధానమిచ్చాడు. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు ఫామ్ అందుకున్నాడు. న్యూజిలాండ్-ఏతో రెండో అనధికారిక టెస్టులో అజేయ సెంచరీతో అదరగొట్టాడు. 162 బంతుల్లో 155 పరుగులు చేసి తన సత్తా చాటాడు. ఇటీవల జైస్వాల్ ఫామ్ ఆందోళన కలిగించింది. గత మూడు ఇన్నింగ్స్‌ల్లో 17, 5, 0 పరుగులకే పరిమితమయ్యాడు. రెండో అనధికారిక టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ డకౌట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్-ఏ 424 పరుగులు చేసింది. మాథ్యూ బాయిల్ సెంచరీ చేయగా.. డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ 93 పరుగులు చేశాడు.
భారత బౌలర్లలో ముకేశ్ కుమార్ ఐదు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లు తీశాడు. దీంతో న్యూజిలాండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగుల ఆధిక్యం లభించింది. 32/0 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత్-ఏ.. రెండో ఇన్నింగ్స్‌లో జైస్వాల్ అద్భుత ఇన్నింగ్స్‌తో పుంజుకుంది. 155 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 15 ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి.
సెంచరీని సిక్సర్‌తో పూర్తి చేసి ఆకట్టుకున్నాడు. అనంతరం యశ్ రాథోడ్ కూడా సెంచరీ సాధించడంతో ఇరు జట్లు డ్రాకు అంగీకరించాయి. న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు ముందు జైస్వాల్ తిరిగి ఫామ్‌లోకి రావడం భారత్‌కు సానుకూల అంశం.

