కలం, నిజామాబాద్ బ్యూరో: తెలంగాణ విశ్వవిద్యాలయంలో మెయిన్ క్యాంపస్ అలాగే సౌత్ క్యాంపస్ లలో ఖాళీగా ఉన్న సీట్లను స్పాట్ కౌన్సిలింగ్ లేదా స్పెషల్ ఫేజ్ అవకాశం ద్వారా సీట్లను భర్తీ చేయాలని పీడీఎస్యూ (PDSU) నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయం (Telangana University)లో యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్కు పీడీఎస్యూ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఈ విద్యా సంవత్సరం మెయిన్ క్యాంపస్, సౌత్ క్యాంపస్ లో 200 పైగా పీజీ ఇతర కోర్సుల సీట్లు ఖాళీగా ఉన్నాయని, ప్రతి విద్యా సంవత్సరం వందల సీట్లు మిగిలిపోతున్నాయనీ చెప్పుకొచ్చారు.
దీని వలన పేద గ్రామీణ ప్రాంత విద్యార్థులు యూనివర్సిటీ విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు పీజీ కళాశాలలకు స్పాట్ కౌన్సిలింగ్ కి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తుంది కానీ ప్రభుత్వ యూనివర్సిటీలకు మిగిలిపోయిన సీట్లను భర్తీ చేయడానికి ఎటువంటి అనుమతులు ఇవ్వడం లేదని ఆక్షేపించారు.
వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని మిగిలిపోయిన సీట్లను భర్తీ చేయడానికి అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొన్ని కోర్సులలో 10 లోపే సీట్లు భర్తీ అయ్యాయని దీనివలన రేపు భవిష్యత్తులో కోర్సులను ఎత్తివేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. యూనివర్సిటీ ఉన్న అన్ని కోర్సులను కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు నవదీప్, జ్ఞానేశ్వర్, నితిన్,రాజు తదితరులు పాల్గొన్నారు.

