కలం, వెబ్ డెస్క్ : టెక్స్టైల్, ఫ్యాషన్, డిజైన్, తయారీ రంగాలో భారత్-ఇటలీ (India–Italy) మధ్య సహకారాన్ని బలోపేతం చేసే దిశగా మిలాన్ వేదికగా నవంబర్ 2న కీలక చర్చలు జరిగాయి. కేంద్ర టెక్స్టైల్స్ శాఖ కార్యదర్శి నీలం షమీ రావు నాయకత్వంలో భారత బృందం ఇటలీలో పర్యటించింది. ఇందులో భాగంగా ఆక్వాఫిల్, గెస్ యూరప్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులతో భేటీ అయి, భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వారా లభించే అవకాశాలు, ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణపై చర్చించారు.
అలాగే నిఫ్ట్ (NIFT) విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్య శిక్షణ, విద్యా సంబంధిత సహకారం అందించేందుకు నాబా (NABA) ఇస్టిట్యూటో మరాంగోని (Istituto Marangoni) డిజైన్ సంస్థలను బృందం సందర్శించింది. ఈ పర్యటనలో భాగంగా నిర్వహించిన ‘ఇండియా–ఇటలీ టెక్స్టైల్ అండ్ మాన్యుఫాక్చరింగ్ పార్ట్నర్షిప్ ఫోరమ్’ ద్వారా పెట్టుబడుల అవకాశాలను ప్రతిపాదించడంతో పాటు ‘భారత్ టెక్స్ 2027’ గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రముఖంగా ప్రదర్శించారు. భారత్ తయారీ సామర్థ్యం, చేనేత వారసత్వానికి ఇటలీ డిజైన్, సాంకేతికత తోడైతే ఇరుదేశాల ఫ్యాషన్ రంగాలు మరింత పురోగతి సాధిస్తాయని ఈ భేటీ స్పష్టం చేసింది.

