కలం, వెబ్డెస్క్: బెంగళూరు ఐటీ కంపెనీల్లో (Bengaluru IT Companies) కన్నడిగులకు సరైన అవకాశాలు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ ఇటీవల ఓ యువతి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. ఈ వీడియోపై సీఎం డీకే శివ కుమార్ కూడా స్పందించారు. తాజాగా కన్నడ సంఘాలు ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నాయి. ఈ మేరకు నేరుగా ఐటీ కంపెనీల వద్దకే వెళ్లి కన్నడిగులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. కర్ణాటకలో ఉన్న కంపెనీలు స్థానిక కన్నడిగులకు ఉద్యోగ అవకాశాల్లో సముచితమైన ప్రాధాన్యత ఇవ్వాలని కర్ణాటక రక్షణ వేదిక రాష్ట్ర అధ్యక్షులు నారాయణ గౌడ డిమాండ్ చేశారు.
ఈ మేరకు సోమవారం బెంగళూరులోని రకూటెన్ ఇండియా ఎంటర్ప్రైజ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. రాష్ట్రంలోనే ఎదుగుతూ, ఇక్కడి వనరులను వినియోగించుకుంటున్న సంస్థలు స్థానిక ప్రజల ఆకాంక్షలను గౌరవించాలని, లేనిపక్షంలో ఇది అనవసర ఘర్షణలకు దారితీసే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. కన్నడిగులకు ఉద్యోగ కల్పన విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని, కేవలం హామీలు సరిపోవని, అది ఆచరణలో స్పష్టంగా కనిపించాలని డిమాండ్ చేశారు. స్థానిక ప్రతిభను గుర్తించి, వారికి అవసరమైన స్కిల్ ట్రైనింగ్ అందించి ఇంటర్వ్యూలలో అర్హత కల్పించాలని కోరారు. ఈ అంశంపై సంస్థ బాధ్యతాయుతంగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, లేదంటే ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి తదుపరి పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

