దత్తత బాలుడి అప్పగింతపై కలెక్టర్ కీలక ప్రకటన

కలం, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో దత్తత తీసుకుని పెంచుకుంటున్న బాలుడిని అధికారులు శిశు సంక్షేమ కేంద్రానికి తరలించారంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న వార్తలపై జిల్లా కలెక్టర్ (Jagtial Collector) బి. సత్య ప్రసాద్ స్పష్టత ఇచ్చారు. హైకోర్టు జారీ చేసిన తాత్కాలిక ఉపశమన ఉత్తర్వుల ప్రకారం బాలుడిని పెంచుకుంటున్న తల్లిదండ్రులకే తిరిగి అప్పగించనున్నట్లు వెల్లడించారు. బాలుడిని పెంచుకుంటున్న మహిళ సోషల్ మీడియాలో వెల్లడించిన వివరాల ప్రకారం.. తమకు సంతానం లేకపోవడంతో హిందూ సంప్రదాయం ప్రకారం ఒక బాలుడిని దత్తత తీసుకుని గత మూడేళ్లుగా పెంచుకుంటున్నారు. అయితే, ఈ దత్తత వ్యవహారంపై వార్తలు రావడంతో అధికారులు బాలుడిని శిశు సంక్షేమ కేంద్రానికి తరలించారు.

ఈ చర్యపై బాధిత దంపతులు న్యాయవాది ద్వారా హైకోర్టును ఆశ్రయించగా, బాలుడిని వెంటనే వారికి అప్పగించాలని కోర్టు మధ్యంతర ఉపశమన ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాలు ఉన్నప్పటికీ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) అధికారిక అనుమతులు, ఇతర చట్టబద్ధమైన పరిపాలనా ప్రక్రియలను పూర్తి చేయాల్సి రావడంతోనే అప్పగింతలో కొంత ఆలస్యం జరిగిందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలన్నీ ప్రస్తుతం పూర్తికావస్తున్నాయని, నవంబర్ 2 రాత్రికి లేదా నవంబర్ 3 ఉదయానికల్లా బాలుడిని దత్తత తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగిస్తామని కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>