కలం, ఖమ్మం బ్యూరో: విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట (Aswaraopeta) గిరిజన సంక్షేమ వసతి గృహం వార్డెన్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన వసతి గృహాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఈ సమావేశంలో భాగంగా అశ్వారావుపేట వసతి గృహంలో సరుకుల సరఫరా తీరుతెన్నులు, హాస్టల్ నిర్వహణ అంశాలపై పీవో ఆరా తీశారు. అయితే, దీనికి సంబంధించి సదరు వార్డెన్ అధికారులకు ఎలాంటి సరైన సమాధానం చెప్పలేకపోయారు. పైగా విధుల్లో తీవ్రమైన అలసత్వం ప్రదర్శించినట్లు స్పష్టమవడంతో, ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ డీడీ చందనకు పీవో ఆదేశాలు జారీ చేశారు.

