గిరిజనులకు రాజకీయ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాలి: టీఆర్పీ నేత‌లు

కలం, నారాయణపేట: గిరిజనుల సమస్యలను ప్రశ్నిస్తున్న రాజు నాయక్‌పై నమోదైన కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని, చేవెళ్ల వేదికగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గిరిజన డిక్లరేషన్‌ను (Chevella Tribal Declaration) తక్షణమే అమలు చేయాలని టీఆర్పీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివ వీరారెడ్డి, సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు బానోత్ హుస్సేన్ నాయక్, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు బోదిగేల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గిరిజనుల హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం, అభివృద్ధి కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. సోమవారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్‌లో నిర్వహించిన గిరిజన గళం పోరుయాత్ర సమావేశంలో వారు మాట్లాడారు.

‘తెలంగాణ యువగళం’ ఛానల్ ద్వారా గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలను రాజు నాయక్ వెలుగులోకి తెస్తున్నారని తెలిపారు. గిరిజనుల సమస్యలను చట్టబద్ధంగా ప్రశ్నిస్తున్న వారిపై కేసులు నమోదు చేయడం ఏమిటని ప్రశ్నించారు. గిరిజనులపైనే గిరిజనులతో కేసులు పెట్టించడం సరికాదన్నారు. ఎమ్మెల్యే పీఏ చిట్టెం మాధవరెడ్డిపై మట్టి, ఇసుక దోపిడీకి సంబంధించిన ఆరోపణలు, అనుచరులకు సంక్షేమ పథకాల కేటాయింపు, ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేయిస్తున్నారనే ఆరోపణలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు ఎమ్మెల్యే అందుబాటులో లేకపోతే ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉందన్నారు. రాజు నాయక్‌పై నమోదైన కేసుల విషయమై గతంలోనే ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

సేవాలాల్ సేన ఆధ్వర్యంలో గత ఏడు రోజులుగా నిర్వహిస్తున్న ‘గిరిజన గళం – తండాలలో నిద్ర’ కార్యక్రమంలో భాగంగా సోమవారం అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్నికల సమయంలో గిరిజనులకు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలును విస్మరించిందని విమర్శించారు. చేవెళ్ల గిరిజన డిక్లరేషన్ కేవలం ఎన్నికల హామీగా మిగిలిపోకూడదని, అందులో పేర్కొన్న అంశాలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా జనాభాలో ఏడు శాతం ఉన్న గిరిజనులకు రాజకీయ, నామినేటెడ్ పదవుల్లో తగిన ప్రాధాన్యం కల్పించడం లేదని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

గిరిజనులను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని ఆరోపించారు. బంజారా భవన్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని కోరారు. రాజు నాయక్‌పై నమోదైన కేసులను ఉపసంహరించుకోవడంతో పాటు గిరిజన డిక్లరేషన్‌ను అమలు చేయకపోతే డీజీపీ స్థాయి అధికారులను కలిసి ఫిర్యాదు చేస్తామని, పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అవసరమైతే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. సేవాలాల్ విద్యార్థి సేన నాయకులు రాజు రాథోడ్, శ్రీనివాస్ నాయక్, ప్రచార కార్యదర్శి తిరుపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>