కలం, ఖమ్మం బ్యూరో: బీఆర్ఎస్ నాయకుడు తక్కెళ్లపల్లి రవీందర్ రావు (Thakkellapally Ravinder Rao) తన నోరు అదుపులో పెట్టుకోవాలని తెలంగాణ రక్షణ సేన ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఎస్కే హుస్సేన్ (TRS Leader SK Hussain) అన్నారు. తమ పార్టీ అధ్యక్షురాలు కవితమ్మపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. వెంటనే ఆమెకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఖమ్మం ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హుస్సేన్ మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎస్కే హుస్సేన్ మాట్లాడుతూ.. తమ పార్టీ అధ్యక్షురాలు కవితమ్మ బహుజనుల బాణమని, బడుగు బలహీన వర్గాల కోసం ఆమె నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. రవీందర్ రావు గురించి అందరికీ తెలుసని, తప్పుడు పద్ధతుల్లో డబ్బులు సంపాదించారని ఆరోపించారు. ఆయన ఎక్కడ పాదం మోపినా అక్కడ బీఆర్ఎస్కు నష్టమేనని, మాట్లాడే ముందు నోరు అదుపులో ఉంచుకోవాలన్నారు.
ఈ సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, బంజారా విభాగం రాష్ట్ర అధ్యక్షులు బానోతు కిషన్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ.. రవీందర్ రావు మాటలు దొర పలికినట్లుగా ఉన్నాయని మండిపడ్డారు. ఆయనలా మాట్లాడడానికి తమకు సంస్కారం అడ్డు వస్తోందన్నారు. బహుజనుల కోసం వచ్చిన కవితమ్మను చూసి ఓర్వలేకే ఆయన పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని విమర్శించారు. వెంటనే కవితమ్మకు రవీందర్ రావు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇకపై నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండింటిలోనూ బీసీ బిడ్డలకే టికెట్లు ఇచ్చారని, పట్టభద్రులందరూ తమ పార్టీని ఆదరించాలని కోరారు.
ఈ మీడియా సమావేశంలో టీఆర్ఎస్ ఉపాధ్యాయ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మోరం వీరభద్రరావు, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు గుగులోత్ రాజ్ కుమార్ నాయక్, పార్టీ జిల్లా నాయకులు వనం నాగేందర్, కార్మిక సంఘం (టీఆర్టీయూ) జిల్లా అధ్యక్షులు జక్కుల ప్రకాశ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

