కలం, మునుగోడు: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ వసతి గృహంలో విద్యార్థులపై వార్డెన్ దాడి చేశారని సమాచార హక్కు రక్షణ చట్టం జిల్లా అధ్యక్షుడు దబ్బటి శేఖర్ (Dabbati Shekhar) ఆరోపించారు. కత్తితో బెదిరించినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారని.. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అక్టోబర్ 29న కమిషనర్ హాస్టల్ తనిఖీకి వస్తున్నారనే కారణంతో విద్యార్థులను వసతి గృహంలోనే ఉంచారని తెలిపారు. పాఠశాలలో ఎఫ్ఆర్ఏ అటెండెన్స్ ఉండటంతో ఐదో తరగతి విద్యార్థులు పాఠశాలకు వెళ్లి తిరిగి హాస్టల్‌కు చేరుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన వార్డెన్ బకెట్‌తో విద్యార్థులపై దాడి చేయడంతో పాటు పదునైన కత్తిని చూపిస్తూ చంపుతానని, గొంతు కోస్తానని బెదిరించినట్లు బాధిత విద్యార్థులు తల్లిదండ్రులకు వివరించారు.
పోలీసులకు ఫిర్యాదు..
దీనిపై వార్డెన్‌ను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు దబ్బటి శేఖర్ తెలిపారు. అనంతరం బాధిత విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి దబ్బటి శేఖర్ చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలల సంరక్షణ అధికారులకు కూడా వివరించగా.. సమాచారం అందుకున్న ఛైల్డ్ వెల్ఫేర్ అధికారులు హాస్టల్‌ను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి వివరాలు సేకరించారు.
వసతి గృహాన్ని తనిఖీ చేసి, పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందించి తగిన చర్యలు తీసుకునేలా చూస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులపై దాడి, కత్తితో బెదిరింపుల ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని దబ్బటి శేఖర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు బుట్టి సత్యం, షేక్ గౌస్, పాలమాకుల రమేష్, కోడం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

