కలం, మునుగోడు : చౌటుప్పల్ పట్టణంలో పూజారి రాళ్లబండి సుధాకర్ స్వామి హత్యతో పాటు భారీ దోపిడీ కేసు(Choutuppal Murder)ను పోలీసులు మూడు గంటల్లోనే ఛేదించారు. హత్యకు పాల్పడి బంగారు, వెండి ఆభరణాలు, నగదు, టాటా సఫారీ కారుతో పరారైన మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు నిందితులను నిర్మల్ జిల్లా గంజాల్ టోల్‌ప్లాజా వద్ద పట్టుకున్నారు. వారి నుంచి రూ.1,73,63,300 విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్, చౌటుప్పల్ డీఎస్పీ పటోళ్ల మధుసూదన్ రెడ్డి వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. అక్టోబర్ 31వ తేదీ రాత్రి సుధాకర్ స్వామి ఇంటికి వచ్చిన పవన్, హర్ష్ అనే ఇద్దరు యువకులు ఆయనను హత్య చేసి, చేతులు, కాళ్లను చీరలతో కట్టివేసి, కత్తితో పొడిచి చంపారు. అనంతరం ఇంట్లోని బంగారు, వెండి ఆభరణాలు, నగదు దోచుకుని టాటా సఫారీ కారులో పరారయ్యారు. అర్ధరాత్రి మృతుడి ఫోన్ నుంచి మేనల్లుడు గుర్రం సురేష్‌కు వాట్సాప్ వాయిస్ మెసేజ్‌లు రావడంతో అనుమానం వచ్చి ఇంటికి వెళ్లి పరిశీలించాడు. కారు కనిపించకపోవడంతో నవంబర్ 1వ తేదీ తెల్లవారుజామున 1.36 గంటలకు డయల్ 112కు సమాచారం ఇచ్చాడు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బెడ్రూమ్లో రక్తపు మడుగులో పడి ఉన్న సుధాకర్ స్వామి మృతదేహాన్ని గుర్తించారు. ఫిర్యాదు మేరకు క్రైమ్ నంబర్ 609/2026 కింద హత్య, దోపిడీ తదితర సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఎస్పీ ఆదేశాలతో డీఎస్పీ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు కారు నంబర్, సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించాయి. ఎన్‌హెచ్-44పై టోల్‌ప్లాజాలను అప్రమత్తం చేయడంతో తెల్లవారుజామున 4.05 గంటలకు నిర్మల్ జిల్లా గంజాల్ టోల్‌ప్లాజా వద్ద ఇద్దరినీ పోలీసులు పట్టుకున్నారు. నిందితులు మధ్యప్రదేశ్‌కు చెందిన పవన్ కుమార్ (21), హర్ష్ సంతోష్ పాండే (24)గా గుర్తించారు.
వారి వద్ద నుంచి 1 కిలో 319.33 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 కిలోల 600.66 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.9,03,300 నగదు, రూ.30 లక్షల విలువైన టాటా సఫారీ కారు, మూడు మొబైల్ ఫోన్లు, హత్యకు ఉపయోగించిన 23 అంగుళాల కత్తిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ.1.73 కోట్లకు పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు వెల్లడించారు. కేసును వేగంగా ఛేదించిన డీఎస్పీ పటోళ్ల మధుసూదన్ రెడ్డి, ఇన్స్పెక్టర్ డి.సతీష్ రెడ్డి, సీసీఎస్ సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐలు కనకటి యాదగిరి, రవీందర్, అజయ్ భార్గవ్, సిబ్బంది, నిర్మల్ జిల్లా పోలీసులను ఎస్పీ అక్షాంశ్ యాదవ్ అభినందించారు.
Also Read : లక్ష మందికి ఏఐ శిక్షణ: మంత్రి శ్రీధర్ బాబు
Follow Us On : WhatsApp

