కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ కూడా వేసవిలో దాహార్తి సమస్య తలెత్తకుండా ముందస్తుగానే పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Ila Tripathi) వెల్లడించారు. కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం అనంతరం పలు కీలక అంశాలపై కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. రానున్న వేసవిలో ప్రతి నివాస ప్రాంతానికి ప్రజల అవసరాలకు సరిపడేలా రక్షిత మంచినీరు సరఫరా అయ్యే విధంగా అధికారులు ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలన్నారు. తాగునీటి సరఫరా తీరుతెన్నులను క్షేత్రస్థాయిలో క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని, ఎక్కడైనా దాహార్తి సమస్య తలెత్తే అవకాశాలు ఉన్నట్లుగా గమనిస్తే, సంబంధిత ప్రాంతాలకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తాగునీటిని అందించేలా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు.
అవసరమైన ప్రాంతాలలో వ్యవసాయ బోరుబావులను అద్దెకు తీసుకునేందుకు వీలుగా గుర్తించాలని, మంచినీటి ట్యాంక్ లు, పైప్ లైన్ వంటి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించాలని ఆదేశించారు. నీటి వృధాకు ఆస్కారం లేకుండా, అందుబాటులో ఉన్న నీటి వనరులు పూర్తిస్థాయిలో సద్వినియోగం అయ్యేలా మండల ప్రత్యేక అధికారులు దృష్టిని కేంద్రీకరించాలని హితవు పలికారు. ఇదిలాఉండగా, ఆయా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, మౌలిక సదుపాయాల మెరుగుదల పనులు, భవిత కేంద్రాల నిర్మాణాలు తదితర వాటి పనులలో వేగం పెంచాలని కలెక్టర్ ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు.
నిర్ణీత గడువులోపు పనులు పూర్తయ్యేలా ఎంఎస్ఓలు, విద్యాశాఖ అధికారులు చొరవ చూపాలన్నారు. అదేవిధంగా ఆయా శాఖలకు సంబంధించి హైకోర్టు కేసుల విషయంలో కౌంటర్లను సకాలంలో ఫైల్ చేయాలని, ఈ కేసుల విషయంలో చేపట్టిన చర్యలను వివరిస్తూ వెంటవెంటనే తనకు నివేదికలు పంపాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు రాజాగౌడ్, భుజంగరావు ట్రైనీ కలెక్టర్ సురేష్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీఆర్డీఓ సాయన్న, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

