కలం, ఆలేరు : ‘ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతి పౌరుడి ఓటు హక్కు ప్రాథమిక పునాది. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమం. ఎన్నికల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలి.’ అని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ ఐలయ్య (MLa Beerla Ilaiah) తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటం, ఓటు హక్కు పవిత్రతను నిలబెట్టడమే లక్ష్యంగా ‘ఇండియా’ కూటమి (INDIA Alliance) ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నిర్వహించిన ‘ఓట్ చోర్ – దేశ్ బచావో’ నిరసన కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల అయిలయ్య ఆలేరు నియోజకవర్గానికి చెందిన సుమారు 99 మంది ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ నుండి ఇండియా కూటమి ఆధ్వర్యంలో ప్రారంభమైన భారీ ర్యాలీలో బీర్ల అయిలయ్య కాంగ్రెస్ శ్రేణులతో కలిసి అడుగులు వేశారు. ప్రజాస్వామ్యానికి మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉద్యమానికి బలమైన సంఘీభావం తెలిపారు. అనంతరం చారిత్రాత్మక రాంలీలా మైదానంలో నిర్వహించిన ఇండియా కూటమి భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.
ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత లోపించిందని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని ఇండియా కూటమి చేస్తున్న డిమాండ్‌కు బీర్ల అయిలయ్య సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.. ఎన్నికల వ్యవస్థలో అవకతవకలు, ఓటర్ల జాబితాలో జరుగుతున్న అక్రమాలు, ‘ఓటు చోరీ’ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి నిజా నిజాలను ప్రజల ముందుంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం తన స్వతంత్రతను, విశ్వసనీయతను పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి చేపడుతున్న ఈ చారిత్రాత్మక పోరాటంలో ఆలేరు నియోజకవర్గం నుండి 99 మంది నాయకులు, కార్యకర్తలు ఢిల్లీకి తరలివచ్చి పాల్గొనడం అభినందనీయమని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ చేపట్టే ప్రతి ఉద్యమంలో ఆలేరు నియోజకవర్గ శ్రేణులు ముందుంటాయని స్పష్టం చేశారు.

