కలం, జనగామ : జనగామ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్ వేముల లక్ష్మణ్ గౌడ్ (PACS Director Vemula Lakshman Goud) మృతి చెందడం కలకలం రేపింది. సోమవారం ఆయన మృతదేహాన్ని గుర్తించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వ్యవసాయ పనుల నిమిత్తం పొలాల వద్దకు వెళ్లిన లక్ష్మణ్ గౌడ్ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో సమీప పొలాల వద్ద ఆయన మృతదేహాన్ని గుర్తించిన రైతులు గ్రామస్తులకు సమాచారం అందించారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.
అప్పుల బాధే కారణమా?
ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన వరి పంట దెబ్బతినడంతో లక్ష్మణ్ గౌడ్ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. పంట నష్టం, అప్పుల భారం కారణంగానే ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే ఆత్మహత్యకు అసలు కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. కాగా, మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుటుంబానికి అండగా నిలిచిన వ్యక్తి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

