కలం, తెలంగాణ బ్యూరో: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ‘సర్’ ప్రక్రియపై ఢిల్లీ నుంచి గల్లీ దాకా రాజకీయ పోరు తీవ్రరూపం దాల్చింది. ఈ అంశంపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదిరి, పోటాపోటీ నిరసనలకు దారితీసింది. ఢిల్లీలో కాంగ్రెస్ బహిరంగ నిరసన చేపట్టిన మరుసటి రోజే, హైదరాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్ర (BJP Maha Padayatra)ను తలపెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఉత్కంఠభరిత వాతావరణంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం హైదరాబాద్ లో పర్యటించనుండటం మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నది.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కేంద్రంలో హడావుడి చేస్తుండగా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హైదరాబాద్ గల్లీలో హడావుడికి సిద్ధమవడం.. ఇందుకోసం ఒకే అంశాన్ని తమ రాజకీయ అస్త్రంగా మలుచుకోవడంతో పొలిటికల్ సర్కిల్స్ లో సరికొత్త ఆసక్తికర చర్చకు తెరలేపింది. మరోవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, త్వరలో జరగనున్న మండల, జిల్లా పరిషత్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు ఇతర మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రెండు జాతీయ పార్టీల కార్యక్రమాలకు ప్రాధాన్యత ఏర్పడింది.
రాజాసింగ్ సొంత గూటికేనా?
ఈ పాదయాత్ర (BJP Maha Padayatra) బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్ నియోజకవర్గమైన గోషామహల్ లో జరుగుతుండటం గమనార్హం. ఆయనను బహిష్కరించినప్పటికీ, నిరంతరం పార్టీ లైన్లోనే పనిచేస్తున్న రాజాసింగ్.. తాజాగా అమిత్ షా పర్యటనను స్వాగతించడమే కాకుండా, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని కాంక్షించడం కొత్త చర్చకు దారితీస్తున్నది. ఒకవైపు రాష్ట్ర నేతల తీరును ఎండగడుతూనే, మరోవైపు కేంద్ర పెద్దలను ప్రసన్నం చేసుకునేలా ఆయన వ్యవహారశైలి ఉన్నదని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. అమిత్ షా పర్యటనను భుజాన వేసుకోవడం కూడా ఇందులో భాగమేనని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో రాజాసింగ్ తిరిగి సొంత గూటికి చేరేందుకు రూట్ క్లియర్ కానుందా? అనే చర్చ ఊపందుకుంది. కేంద్ర పెద్దల ఆశీస్సులు లభిస్తే రాజాసింగ్ మళ్లీ కాషాయ తీర్థం పుచ్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదని ఆయన అనుచరవర్గం భావిస్తున్నది. ఈ క్రమంలో అమిత్ షా పాదయాత్ర తర్వాత గోషామహల్ రాజకీయం ఎలాంటి మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరం.
గంటసేపు పాదయాత్ర.. ప్రసంగం
నిజాం కాలేజీ ఎదురుగా ఉన్న బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహం నుంచి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు బీజేపీ మహా పాదయాత్ర ప్రారంభం కానుంది. అబిడ్స్ మీదుగా మొజంజాహీ మార్కెట్ వరకు సాగే ఈ యాత్రలో అమిత్ షా పాల్గొంటారు. సుమారు గంటపాటు యాత్ర కొనసాగనుండగా, అనంతరం మొజంజాహీ మార్కెట్ చౌరస్తాలో నిర్వహించే స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో ఆయన ప్రసంగించనున్నారు. ‘లోక్ తంత్ర్ బచావో – అరాచకత హటావో’ (ప్రజాస్వామ్యాన్ని కాపాడండి – అరాచకత్వాన్ని అంతం చేయండి) నినాదంతో బీజేపీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుతో పాటు పలువురు ముఖ్యనేతలు, పార్టీ కార్యకర్తలు భారీగా పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
‘సర్’పై ఆరోపణలను తిప్పికొట్టడమే లక్ష్యం
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టడమే పాదయాత్ర ప్రధాన ఉద్దేశమని బీజేపీ చెబుతున్నది. ఈ నేపథ్యంలో అమిత్ షా పర్యటనను రాష్ట్ర నాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పార్టీ బలాన్ని పెంచుకోవడం, కార్యకర్తల్లో ఉత్సాహం నింపడం, కాంగ్రెస్ ఆరోపణలకు రాజకీయంగా సమాధానం చెప్పడం వంటి లక్ష్యాలతో ఈ పాదయాత్రను నిర్వహిస్తున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, అమిత్ షా తన ప్రసంగంలో సర్ ప్రక్రియతో పాటు తెలంగాణ రాజకీయాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

