కలం, నిర్మల్: దేశంలో రాజ్యాంగ బద్ధ సంస్థలపై కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తూ ప్రజల్లో అవిశ్వాసాన్ని పెంచే ప్రయత్నం చేస్తోందని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఓటమిని జీర్ణించుకోలేక రాజ్యాంగ సంస్థలపై నిందలు వేస్తూ, అరాచక శక్తులతో చేతులు కలిపి దేశంలో అస్థిరత సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రాజకీయాలను ప్రజల్లో ఎండగడుతూ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ సంస్థలను పరిరక్షించాలనే లక్ష్యంతో నవంబర్ 2న హైదరాబాద్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాదయాత్ర నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ఏలేటి తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు నిజాం కాలేజ్ నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర మొజంజాహీ మార్కెట్ వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రజలు, బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

