కలం, వనపర్తి: వనపర్తి (Wanaparthy) పట్టణంలో ఓ 16 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగినట్లు కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదుపై పోలీసులు చర్యలు చేపట్టారు. మటన్ షాపు రహీం (42) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు బీజేపీ నాయకులు, హిందూవాహిని కార్యకర్తలు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు రెండేళ్లుగా బాలికపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు, కుటుంబ సభ్యులను బెదిరించినట్లు ఆరోపించారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు, హిందూవాహిని కార్యకర్తలు బాధిత కుటుంబాన్ని పరామర్శించి పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి సమగ్ర విచారణ జరపాలని, బాధిత బాలికకు వైద్య సహాయం, మానసిక భరోసాతో పాటు కుటుంబానికి రక్షణ కల్పించాలని వారు కోరారు. కుటుంబాన్ని బెదిరించినట్లు వచ్చిన ఆరోపణలపైనా విచారణ జరిపి, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాలికకు న్యాయం జరిగే వరకు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు.

