కలం, జోగులాంబ గద్వాల: జోగుళాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే లక్ష్యంగా జిల్లా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆదివారం జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు ఆదేశాల మేరకు గద్వాల పట్టణంతో పాటు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో విస్తృత ఓపెన్ బ్యూసింగ్ తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ వాహన తనిఖీలు, బెల్ట్ షాపుల తనిఖీలు నిర్వహించారు. ప్రజలకు సురక్షిత ప్రయాణాన్ని అందించడం, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం, ట్రాఫిక్ నిబంధనల అమలును పటిష్టం చేయడంలో భాగంగా పట్టణంలోని శివారు ప్రాంతాలలో పాటు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా అనుమానస్పదంగా ఉన్న బెల్ట్ షాపులను తనిఖీలు చేశారు.
ఈ సందర్భంగా వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర అవసరమైన ధ్రువపత్రాలను పరిశీలిస్తూ, ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులను గుర్తిస్తూ, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా నిర్వహించారు. అనుమతులు లేకుండా బెల్ట్ షాప్స్ నిర్వహించే వారిపై కేసులు నమోదు చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై నిఘా ఉంచారు. అలాగే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ వినియోగించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

