కలం,మెదక్ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కీలక నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao)పై సిద్దిపేట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు నమోదైంది. సిద్దిపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గాదగోని చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తొలుత హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన ప్రాంతం సిద్దిపేట కావడంతో ఇక్కడి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు క్రైం నం.496/2026 ఎఫ్ఐఆర్ బదిలీ చేయడంతో పాటు అదనంగా మరికొన్ని సెక్షన్లు కూడా జోడించారు.
A1గా హరీశ్ రావు.. A2గా రాధాకిషన్ రావు
కొత్త ఎఫ్‌ఐఆర్‌లోని నిందితుల జాబితాలో A1గా హరీశ్ రావు, A2గా మాజీ డీసీపీ రాధాకిషన్ రావు పేరుతో పాటు “ఇతరులు” అని పేర్కొన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన ఫోన్, తన భార్య ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఆరోపిస్తూ చక్రధర్ గౌడ్ 2024 డిసెంబర్ ఒకటో తేదీన పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాన్ని ఇప్పుడు సిద్దిపేట వన్‌టౌన్ స్టేషన్‌కు బదిలీ చేసి ఎఫ్‌ఐఆర్‌లో అదనంగా ఆరు సెక్షన్లు చేర్చారు. అవి భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్లు 419, 420, 467, 406, సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్లు 66C, 66Dగా పేర్కొన్నారు.

