కలం, వెబ్ డెస్క్: విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) రేపు బెంగళూరుకి వెళ్లబోతున్నారు. రాప్తాడులో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని అక్కడ మణిపాల్ ఆసుపత్రిలో చేర్పించగా.. వెళ్లి పరామర్శించబోతున్నారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకోబోతున్నారు. ఘటన జరిగిన వెంటనే అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరికొన్ని ఆపరేషన్లు చేయాల్సి ఉండటంతో వెంటనే బెంగళూరుకి తరలించాలని నిర్ణయించారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడిన మంత్రి లోకేష్ గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయించి.. గంటల వ్యవధిలోనే బెంగళూరుకు తరలించేలా చర్యలు తీసుకున్నారు.
సీఎం చంద్రబాబు సైతం ఎప్పటికప్పుడు విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ ఘాతుకానికి పాల్పడిన ఉన్మాది హేమంత్‌ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయగా.. రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారు. కాగా ఈ ఘటన సోషల్ మీడియాలో వైరలవుతుండటంతో దేశ వ్యాప్తంగా ఉన్న నెటిజన్లు స్పందిస్తున్నారు. ఉన్మాదిని ఎన్‌కౌంటర్ చేయాలని, బహిరంగంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

