కోరుట్ల ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ సునీతారాణి సస్పెండ్

కలం, కరీంనగర్ బ్యూరో: కోరుట్ల ఏరియా ఆసుపత్రి (Korutla Hospital) సూపరింటెండెంట్ డాక్టర్ వి. సునీతారాణి (Sunitha Rani)ని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం, పరిపాలనా పర్యవేక్షణలో వైఫల్యం, ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన కారణాలతో ఆమె సస్పెండ్ అయ్యారు. శనివారం జిల్లా కలెక్టర్ కోరుట్ల ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. ఈ తనిఖీల్లో సూపరింటెండెంట్ ఎలాంటి సమర్థ అధికారి నుంచి ముందస్తు అనుమతి పొందకుండానే విధులకు గైర్హాజరైనట్లు గుర్తించారు.

ఆసుపత్రి పరిపాలనను పర్యవేక్షించడంతో పాటు, రోగులకు నిరంతర వైద్యసేవలు అందేలా చూడాల్సిన బాధ్యత కలిగిన ప్రధానాధికారి స్వయంగా విధులకు గైర్హాజరు కావడాన్ని కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు. ​అంతేకాకుండా ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బందిలో దాదాపు సగం మందికి ఒకేసారి సెలవులు మంజూరు చేసినట్లు కలెక్టర్ గుర్తించారు. ఆసుపత్రి సేవలు నిరాటంకంగా కొనసాగేందుకు అవసరమైన సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాల్సిన బాధ్యతను విస్మరించడం… పరిపాలనా నిర్లక్ష్యానికి, పర్యవేక్షణ లోపానికి నిదర్శనమని కలెక్టర్ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

ప్రజలకు అత్యవసరమైన వైద్యసేవలు అందించే ప్రభుత్వ ఆసుపత్రిలో తగినంత మంది వైద్యులు, ఇతర సిబ్బంది అందుబాటులో ఉండటం అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. ​ఈ నేపథ్యంలో గుర్తించిన లోపాల తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, ఆమెపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమిస్తూ సస్పెన్షన్ వేటు వేశారు. తదుపరి క్రమశిక్షణ చర్యలు ముగిసి, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ సస్పెన్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. అలాగే ఈ సస్పెన్షన్ కాలంలో జిల్లా కలెక్టర్ ముందస్తు అనుమతి లేకుండా ప్రధాన కార్యస్థానాన్ని విడిచి వెళ్లరాదని ఉత్తర్వుల్లో స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>