కలం, మునుగోడు: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి (Burugu Krishna Reddy) విమర్శించారు. చౌటుప్పల్ మండలం మందల్లోగూడెంలో సీపీఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బూరుగు కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం కుప్పల్లోకి నీరు చేరి రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి కొబ్బరికాయలు కొట్టి వారం రోజులు గడుస్తున్నా.. ధాన్యం కొనుగోళ్లు మాత్రం ప్రారంభం కాలేదని మండిపడ్డారు. వాటి వలన వాటి ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు.
వెంటనే ప్రారంభించాలి..
కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన రైతులు రోజుల తరబడి ఎదురుచూస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బూరుగు కృష్ణారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తేమ శాతం, ఇతర సాంకేతిక కారణాలతో రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో గొర్రెల మేకల పెంపకదారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండే శ్రీశైలం, సీపీఎం గ్రామ శాఖ కార్యదర్శి ఇట్టబోయిన శేఖర్, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ చప్పిడి లక్ష్మారెడ్డి, మాజీ వార్డు సభ్యురాలు చప్పిడి సరిత, శ్రీనివాస్ రెడ్డి, గ్రామ నాయకులు బుర్రి లింగారెడ్డి, వల్లూరి ఐలయ్య, యాట కొండల్, బోరెం నర్సిరెడ్డి, గంగాదేవి పద్మ, గంగాదేవి మహేష్ పాల్గొన్నారు.

