కలం, వెబ్డెస్క్: ఏపీలోని అనంతపూర్ జిల్లా రాప్తాడు (Rapthadu) జెడ్పీ హైస్కూల్లో తరగతి గదిలో విద్యార్థినిపై దాడి చేసిన ఘటనపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) ఎక్స్ వేదికగా స్పందించారు. పాఠశాల తరగతి గదిలోకి ఓ దుండగుడు స్వేచ్ఛగా ప్రవేశించి బాలికపై దాడికి పాల్పడటం రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయనడానికి నిదర్శనమని విమర్శించారు. టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనలో ‘జంగిల్ రాజ్’ కొనసాగుతోందని ఆరోపించారు. విద్యాసంస్థల్లోనే విద్యార్థులకు రక్షణ కల్పించలేని ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థిని కూడా గాయపడటం బాధాకరమని పేర్కొన్నారు. రాజకీయ కక్షలు, ‘రెడ్ బుక్’ పాలనకు ప్రాధాన్యత ఇవ్వడంతో నేరగాళ్లు చట్టమంటే భయం లేకుండా వ్యవహరిస్తున్నారని జగన్ ఆరోపించారు.
గాయపడిన విద్యార్థినులకు తక్షణమే అత్యుత్తమ వైద్య చికిత్స అందించాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం భరోసా కల్పించాలని జగన్ (YS Jagan) డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసి, పారదర్శకమైన విచారణ ద్వారా చట్టం ముందు నిలబెట్టాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో భద్రతా ప్రమాణాలపై అత్యవసర సమీక్ష నిర్వహించాలని సూచించారు. ఈ ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ పూర్తి బాధ్యత వహించాలని వైఎస్ జగన్ తన పోస్టులో డిమాండ్ చేశారు.
Also Read : కుమార్తె పెళ్లి వేదికపై షర్మిల కీలక ప్రకటన!
Follow Us On: X(Twitter)

