కలం, వరంగల్: గ్రేటర్ వరంగల్ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కార్పొరేషన్ కమిషనర్ టి.వెంకన్న (Commissioner Venkanna) అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. పనుల్లో నాణ్యత లోపిస్తే బిల్లుల్లో కోత విధిస్తామని హెచ్చరించారు. శుక్రవారం కాశీబుగ్గ, పోతరాజుపల్లి, ఉర్సు, తోట మైదానం, గిర్మాజీపేట, చార్బౌలి, లక్ష్మీపురం మార్కెట్, వరంగల్ చౌరస్తా ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ, పైప్‌లైన్ నిర్మాణ పనులను పరిశీలించారు.
కాజీపేట పరిధిలోని బంధం చెరువు, దర్గా సమీపం, పిస్తా హౌస్ ప్రాంతాలతో పాటు శాయంపేటలో రోడ్లు, డ్రైనేజీ పనులు, ఉర్సులో నిర్మిస్తున్న యూపీహెచ్సీ భవనాన్ని తనిఖీ చేశారు. శాయంపేటలో పారిశుద్ధ్య పనులను కమిషనర్ టి.వెంకన్న ఆకస్మికంగా పరిశీలించి.. స్వచ్ఛ ఆటో ద్వారా రోజూ చెత్త సేకరిస్తున్నారా అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. నగరంలో పరిశుభ్రమైన వాతావరణం కల్పించేలా పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని సూచించారు. ఈఈలు సంజయ్‌కుమార్, రవికుమార్, ఇంజనీరింగ్, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

