కలం, మునుగోడు : రైతులు ఎంతో కష్టపడి పండించిన ధాన్యాన్ని విక్రయించే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సమన్వయంతో పనిచేయాలని చౌటుప్పల్(Choutuppal) మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య (Ubbu Venkataiah) సూచించారు. రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
శుక్రవారం చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపురం, ఎనగంటి తండా, అల్లాపురం, పీపల్ పహాడ్, దేవులమ్మ నాగారం, దామెర గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. అనంతరం కొనుగోలు కేంద్రాలను సందర్శించి ధాన్యం సేకరణ ప్రక్రియను, రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉబ్బు వెంకటయ్య మాట్లాడుతూ.. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన వెంటనే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనుగోలు ప్రక్రియ చేపట్టి, ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే తూకం వేయాలని సూచించారు.
రైతులకు సకాలంలో నగదు చెల్లింపులు జరిగేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. రైతులు ధాన్యాన్ని విక్రయించేందుకు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి రాకూడదన్నారు. తేమశాతం నిబంధనల ప్రకారం ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన గన్నీ సంచులు, తూకం యంత్రాలు, ఇతర మౌలిక సదుపాయాలను అందుబాటులో ఉంచాలని సూచించారు.
రైతులకు ఏవైనా సమస్యలు ఎదురైతే వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని, కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు. రైతుల శ్రమకు తగిన గిట్టుబాటు ధర అందేలా, ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పీపీఎస్ చైర్మన్ మస్తాన్బాబు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, మండల సహకార అధ్యక్షులు అలివేలు, కోశాధికారి సుమలత, ఏపీఎం యాదయ్య, సీసీలు నరసింహ, కల్పన తదితరులు పాల్గొన్నారు.

