సెల్‌ఫోన్ కోసం కన్నకూతురిని కడతేర్చిన తల్లి.. అసలేం జరిగింది?

కలం, వెబ్ డెస్క్: సెల్‌ఫోన్ వాడకం ఓ కన్నతల్లిని హంతకురాలిగా చేసింది. మొబైల్ ఫోన్‌కు బానిసై చదువు నిర్లక్ష్యం చేస్తుందనే కోపంతో, క్షణికావేశంలో ఓ తల్లి 14 ఏళ్ల కూతురిని గొంతునులిమి దారుణంగా హత్య చేసిన ఘటన రంగారెడ్డి (Rangareddy) జిల్లా కొత్తూరు (Kothur) మున్సిపాలిటీ పరిధిలో వెలుగుచూసింది.

పోలీసుల కథనం ప్రకారం.. కొత్తూరు హనుమాన్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ ముయ్యడి రాజు, విజయలక్ష్మి దంపతులకు 9వ తరగతి చదువుతున్న సువర్చల (14) అనే కూతురు ఉంది. అయితే ఆ బాలిక తరచూ సెల్‌ఫోన్ చూస్తుండటంతో తల్లి విజయలక్ష్మి పలుమార్లు మందలించింది. ఈ విషయమై వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.

అయితే ఇటీవల విజయలక్ష్మి పని ముగించుకుని ఇంటికి వచ్చేసరికి, కుమార్తె ఫోన్ చూస్తూ కనిపించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తల్లి, కూతురితో గొడవపడి క్షణికావేశంలో ఆమె గొంతు నులిమి చంపేసింది. నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి విజయలక్ష్మి కూతురి మెడకు చీర చుట్టి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ఆపై తన భర్తకు ఫోన్ చేసి, తను వచ్చేసరికి బిడ్డ ఉరివేసుకుందని నమ్మించింది.

తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదికలో బాలికది ఆత్మహత్య కాదు, గొంతు నులిమి చంపడం వల్లే ఊపిరాడక చనిపోయిందని తేలింది. దీంతో పోలీసులు విజయలక్ష్మిని తమదైన శైలిలో విచారించగా, ఫోన్ ఎక్కువగా వాడుతుందనే కోపంతో తానే చంపినట్లు నేరాన్ని అంగీకరించింది. కొత్తూరు పోలీసులు నిందితురాలైన తల్లిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>