కలం, ఢిల్లీ బ్యూరో: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ సహా ఆరు రాష్ట్రాల్లో ‘సర్’ గడువును పొడిగించింది (ECI Extends SIR). తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, నాగాలాండ్‌లో సర్ గడువును పొడిగిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు సంబంధించి తొలుత రూపొందించిన షెడ్యూల్ ప్రకారం ఓటర్ల నుంచి అభ్యంతరాలను, ఫిర్యాదులను పరిష్కరించడానికి నవంబర్ 5 వరకు అవకాశం ఉండగా, దాన్ని నవంబర్ 26 వరకు పెంచింది.
గత షెడ్యూల్ ప్రకారం తుది ఓటర్ల జాబితాను నవంబర్ 9న వెలువరించాల్సి ఉండగా, దాన్ని నవంబర్ 30కి మార్చింది. ‘సర్’కు వ్యతిరేకంగా ఢిల్లీలో నవంబర్ 1న కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండియా కూటమి భారీ ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో ఈసీ హడావిడిగా ఈ పొడిగింపు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. గతంలోనూ తెలంగాణలో సర్ గడువును ఒకసారి పొడిగించగా, ఇప్పుడిది రెండోసారి.
రాజకీయ పార్టీల విజ్ఞప్తితో..
వివిధ రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు తెలంగాణలో సర్ గడువు పొడిగిస్తూ ఈసీ నిర్ణయం తీసుకున్నది. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులైన ఓటర్లను జాబితాలో చేర్చేందుకు బీఎల్ఓ (బూత్ లెవల్ ఆఫీసర్లు)లు ఇంటింటికీ తిరిగి వివరాలను తీసుకోనున్నారు. ఓటర్ల జాబితాలో పేర్ల గల్లంతుకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదులు, అభ్యంతరాలను పరిష్కరించడానికి ఎన్నికల సిబ్బందికి తాజా గడువు పొడిగింపుతో దాదాపు మూడు వారాల అదనపు సమయం లభించినట్లయింది. తుది జాబితా నవంబర్ 9వ తేదీకి బదులుగా 30న విడుదల కానున్నది.

