కలం, తెలంగాణ బ్యూరో: తెలంగాణలోని వరి పొలాలపై ఇతర రాష్ట్రాల వ్యాపారులు దండయాత్ర చేస్తున్నారు. కోతలకు ఇంకా టైమ్ ఉన్నా రైతుల దగ్గరికే వచ్చి పచ్చి వడ్లనే కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధర రూ.2,461 (ఫైన్ వెరైటీ రైస్ క్వింటాల్‌కు) కంటే డబుల్ రేటు (Telangana Paddy Price) ఇచ్చి మరీ కొంటున్నారు. నిజామాబాద్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో క్వింటాల్ సన్న వడ్ల ధర గరిష్ట స్థాయిలో రూ.5 వేలు పలుకుతున్నది. దీంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో వడ్లను అమ్మడానికి రైతులు ఆసక్తి చూపడం లేదు.
ఇక ప్రభుత్వం సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ ఇస్తున్నప్పటికీ, ఈసారి ఆదరణ కరువైంది. బోనస్‌తో కలుపుకుంటే రైతుకు క్వింటాల్‌కు రూ.2,961 మాత్రమే అందుతున్నది. కానీ ప్రైవేట్ వ్యాపారులు కనీసం రూ.4 వేల కంటే ఎక్కువ రేటుకే కొంటుడడంతో రైతులు అటువైపే మొగ్గు చూపుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు వడ్లు రాకపోతే భవిష్యత్తులో రేషన్ దుకాణాలకు, సంక్షేమ హాస్టళ్లకు, మధ్యాహ్న భోజన పథకానికి ప్రభుత్వ సరఫరా ఎలాగనేది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది.
రబీ సీజన్‌కూ ఇప్పుడే అగ్రిమెంట్
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర నుంచి వ్యాపారులు ప్రతీరోజు రైతుల పొలాల్లోకి వచ్చి ఖరీఫ్ వడ్లను కొనుగోలు చేస్తున్నారు. తాలు, తేమ లాంటివేవీ పట్టించుకోకుండా పచ్చి వడ్లనే కొని, అక్కడికక్కడే రైతులకు డబ్బులు ఇచ్చేస్తున్నారు. ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో ఏ జిల్లాలో ఎన్ని టన్నుల విక్రయాలు జరిగాయనే లెక్కలు అధికారుల దగ్గర లేవు. ఎక్కువ రేట్ వచ్చేసరికి సీజన్‌కు అవసరమైన విత్తనాల గురించి కూడా పట్టించుకోకుండా రైతులు మొత్తం ధాన్యం అమ్మేస్తున్నారు. ఇది వానాకాలం సీజన్ కావడంతో ఎక్కువగా సన్న వడ్లే పండాయి. వచ్చే రబీ సీజన్ అవసరాలకు సైతం రైతులతో వ్యాపారులు కొంత టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి ఒప్పందం చేసుకుంటున్నారు. బోరు బావుల్లో నీటి లభ్యతను గమనంలోకి తీసుకుని కచ్చితంగా వరి పండుతుందనే నమ్మకంతో ఈ ఒప్పందాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం రబీలో వరి వేయొద్దన్నా నీటి సౌకర్యం ఉన్నందున పండుతుందనే నమ్మకం ఉన్న రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. ఎలాగూ రాష్ట్రంలో వరి ఉత్పత్తి తగ్గనున్నందున పండిన కొంత పంటకైనా బంపర్ రేటు వస్తుందని రైతులు నమ్ముతున్నారు.
5 నెలలకే స్టాక్
ప్రభుత్వం దగ్గర గోదాముల్లో ఇప్పుడున్న 9.64 లక్షల టన్నుల బియ్యం బఫర్ స్టాక్ ఐదు నెలల వరకు మాత్రమే సరిపోతుందని, మిల్లర్ల దగ్గర నుంచి కస్టమ్ మిల్లింగ్ రైస్ కోసం వెళ్లిన 18 లక్షల టన్నులు వస్తే ఏడాది వరకు ఢోకా ఉండదని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. ప్రతినెలా సుమారు 3.42 కోట్ల మందికి రేషన్ దుకాణాల ద్వారా సుమారు 2.10 లక్షల టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. అయితే మిల్లర్ల దగ్గరి నుంచి రావాల్సిన బియ్యంలో ఎంత వస్తాయనే దానిపై క్లారిటీ లేదు. ఇప్పటికే ప్రైవేట్ వ్యాపారులకు మిల్లర్లు అమ్ముకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఓవైపు ఎల్‌నినో కారణంగా ఖరీఫ్ సీజన్లో వరి సాగు విస్తీర్ణం తగ్గడం, మరోవైపు ఉత్పత్తి అయిన ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు రాకుండా ఇతర రాష్ట్రాల ప్రైవేట్ వ్యాపారుల దగ్గరకు వెళ్తుండడంతో.. ఇకపై రేషన్ షాపులకు సరఫరా ఎలా అనేది కీలకంగా మారింది. ప్రైవేట్ నుంచి ఎక్కువ ధరకు కొని సరఫరా చేయడం ప్రభుత్వానికి ఆర్థికంగా భారమవుతుంది. ఇక సంక్షేమ హాస్టళ్లకు సమకూర్చడం కూడా ఇబ్బందికరంగానే మారనున్నది.
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి
రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కనీస మద్దతు ధరకే వడ్లు అమ్ముకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్వింటాల్‌కు రూ.500 చొప్పున ప్రభుత్వం నుంచి బోనస్ వస్తుంది. ఈ రెండూ కలిపి రూ.3 వేలు దాటడం లేదు. కానీ ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటే ఇంతకంటే ఎక్కువే వస్తుందని రైతులు అంటున్నారు. రైతులు లాభం పొందుతున్నప్పుడు ప్రభుత్వం సైతం ‘వద్దు’ అని చెప్పలేకపోతున్నది. అదే సమయంలో ఐకేపీ సెంటర్లకు ధాన్యం రాకపోతే రేషన్ దుకాణాలకు సరఫరా ఎలా అనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. తప్పనిసరిగా ఐకేపీ కేంద్రాల్లోనే అమ్మాలంటూ రైతుల్ని బలవంతపెట్టలేక, ప్రైవేట్ వ్యాపారులను నియంత్రించలేక ప్రభుత్వం పరిస్థితి ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి..’ తరహాలో మారింది. రైతుల నుంచి వడ్లు రాకపోతే రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరాకు ప్రభుత్వం ముందున్న ప్రత్యామ్నాయమేంటనేది కూడా కీలకంగా మారింది. మిల్లర్ల దగ్గర పెండింగ్‌లో ఉన్న 18 లక్షల టన్నుల సీఎంఆర్ బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడమే ఏకైక మార్గంగా కనిపిస్తున్నది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ వడ్ల కొనుగోళ్ల లక్ష్యం 65 లక్షల టన్నులు అయినప్పటికీ, అసలు అందులో ఎంత వస్తుందనే దానిపై క్లారిటీ లేదు.

