కలం, వెబ్ డెస్క్: ఇరాన్‌తో యుద్ధానికి కాస్తా గ్యాప్ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి దాడులకు సిద్ధమవుతున్నారనే ఆందోళన నెలకొంది. అగ్రరాజ్యంలో మధ్యంతర ఎన్నికలు ముగిసిన వెంటనే నవంబర్ మూడో తేదీ తరువాత సైనిక చర్యను ప్రారంభించే అవకాశాలున్నాయని ఇద్దరు దౌత్యవేత్తలు తెలిపారని అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది. ఈసారి చేపట్టబోయే దాడులు కొద్ది రోజుల పాటు కొనసాగే అవకాశాలున్నాయని.. అందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని అమెరికా తన మిత్రదేశాలకు అలర్ట్ కూడా పంపించిందని చెబుతున్నారు.
ఇరాన్ ప్రతి దాడులు కూడా చేసే అవకాశం ఉంటుందని.. గల్ఫ్ ప్రాంతంలోని ఇంధన కేంద్రాలు, ఆయిల్ మౌలిక సదుపాయాలు, ఇతర కీలక వ్యవస్థలను లక్ష్యంగా చేసుకోవచ్చని కూడా హెచ్చరించింది. అయితే దీనిపై ఇంతవరకు ట్రంప్ ఎక్కడా బహిరంగ ప్రకటనలు చేయకపోయినా.. అంతర్గతంగా మాత్రం ఈ ప్రణాళికలు రూపొందిస్తూ ఉండొచ్చనే అనుమానాన్ని గ్లోబల్ ఎఫైర్స్ నిపుణులు సైతం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా సుమారు 9 వేల మంది సైనికులను గల్ఫ్ ప్రాంతానికి తరలిస్తుందని తెలుస్తోంది.
మళ్లీ ఎందుకు..?
ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని అడ్డుకునే లక్ష్యంతో అమెరికా ఫిబ్రవరి 28న యుద్ధాన్ని ప్రారంభించింది. తొలి దశ దాడుల్లోనే సుప్రీం లీడర్ అయతొల్లా ఖమైనీని హతమార్చినా.. హోర్ముజ్ జలసంధిపై పట్టు బిగించడం ద్వారా ఇరాన్ అగ్రరాజ్యాన్ని ముప్పుతిప్పలు పెడుతోంది. ఒకవైపు చర్చలు.. మరోవైపు దాడులు అన్నట్లుగా యుద్ధం పరిస్థితి ఉంది. తన కండీషన్లకు టెహ్రాన్ ఏమాత్రం అంగీకరించకపోవడంతో మరోసారి భీకర దాడులు చేయాలనేది ట్రంప్ ప్లాన్‌గా చెబుతున్నారు. గతంలో చేపట్టిన దాడులతో ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థ అల్లకల్లోలంగా మారింది. మరోసారి ఘర్షణలు తలెత్తితే పరిస్థితి ఏంటనేది ఆందోళనకరంగా మారింది. అయితే మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్‌కు ఎదురుగాలి వీస్తే మాత్రం యుద్ధం మరో మలుపు తిరిగే అవకాశం లేకపోలేదని విశ్లేషిస్తున్నారు.
ఇరాన్ ఏమంటోంది..?
అమెరికాతో యుద్ధం వలన ఇరాన్ సైతం తీవ్రంగా నష్టపోతోంది. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణకు చర్చల ద్వారా పరిష్కారం లభిస్తుందని పేర్కొంటుంది. అయితే తమ కండీషన్లకు అమెరికా అంగీకరించాల్సిందేనని పట్టుబడుతోంది. వాటిలో కొన్ని.. వెంటనే కాల్పుల విరమణ ప్రకటించడం, హోర్ముజ్ జలసంధిలో నౌకలు తిరిగి సాఫీగా రాకపోకలు సాగించేలా చేయడం, విదేశాల్లో జప్తు చేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం, ఇరాన్ చమురు రంగంపై విధించిన ఆంక్షలను వెంటనే తొలంగించడం, అమెరికా నేవీ దిగ్బంధనం నుంచి విముక్తి కల్పించడమనేవి ప్రధాన అంశాలు. ఇరాన్ కండీషన్లపై గతంలోనే ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హోర్ముజ్ జలసంధిని ఇరాన్‌కు ఎట్టిపరిస్థితుల్లో గుత్తాధిపత్యం ఉండటానికి వీల్లేదని చెప్పేశారు.

