రామారావు హత్య కేసు.. సిట్ దర్యాప్తునకు సిపిఎం డిమాండ్

కలం, ఖమ్మం బ్యూరో : సిపిఎం నేత సామినేని రామారావు హత్య కేసులో పోలీసులు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే సంబంధం లేని నలుగురిని అరెస్ట్ చేసి, అసలైన హంతకులను వదిలేస్తున్నారని సిపిఎం (CPM) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తీవ్రంగా ఆరోపించారు. గురువారం ఆయన ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన సాక్షులు, మృతుడు రామారావు భార్య స్వయంగా కొందరి పేర్లు స్పష్టంగా చెప్పినప్పటికీ పోలీసులు వారిని విచారించకుండా వదిలేశారని ఆయన పేర్కొన్నారు. అసలైన హంతకులను రక్షించేందుకే అభూత కల్పనలతో కూడిన ఓ ‘క్రైమ్ స్టోరీ’ని రూపొందించి, సీపీ స్వయంగా దానికి బాధ్యత వహిస్తున్నారని విమర్శించారు.

ఖమ్మం పోలీస్ కమిషనర్ తీరుపై తమకు ఎలాంటి నమ్మకం లేదని స్పష్టం చేసిన నున్నా నాగేశ్వరరావు, ఈ హత్య కేసుపై సిట్‌తో దర్యాప్తు(SIT Investigation) జరిపించి న్యాయం చేయాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. తొలుత సిట్ దర్యాప్తు జరిపిస్తానని హామీ ఇచ్చిన సీఎం ఆ తర్వాత మాట తప్పడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి సిట్‌తో హత్య కేసుపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఘటనను ప్రత్యక్షంగా చూసిన సాక్షులను, రామారావు భార్య పేర్కొన్న వ్యక్తులను వెంటనే విచారించి అసలైన నిందితులను అరెస్ట్ చేయాలని కోరారు. నామమాత్రంగా నలుగురిని కేసులో ఇరికించి, అసలైన దోషులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని తాము మొదటి నుంచీ చెబుతున్నామని, ఈ కుట్రను ప్రజలు గమనించాలని నున్నా నాగేశ్వరరావు తన ప్రకటనలో పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>