కలం, అచ్చంపేట: అచ్చంపేట (Achampet) నియోజకవర్గంలో ఓ వ్యక్తి బతికుండగానే మరణించినట్లు ధృవీకరణ పత్రాలు తయారు చేసి భూపట్టాలు మార్పిడి చేసిన ఘటన అందరికీ తెలిసిందే. తాజాగా అచ్చంపేట నియోజకవర్గంలోని ఉప్పునుంతల మండలం అయ్యవారిపల్లి గ్రామం శివారులో మరో ఘటన వెలుగుచూసింది. గ్రామంలో 115 సర్వే నెంబర్లు 13 ఎకరాల 17 భూమి అక్రమార్కులకు పట్టా అయింది. ఈ నెల 12న కలంలో ఇదే విషయంపై వార్త ప్రచురితమైంది. 18 రోజులు గడిచినప్పటికీ ఎలాంటి విషయాలు బయటకు రాకపోవడంతో కలం మళ్లీ గురువారం అచ్చంపేట సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ సలోని చాబ్రా (Saloni Chhabra)ను వివరణ కోరింది. మరో రెండు రోజుల్లో పూర్తి నివేదికను కలెక్టర్ అందజేస్తామని మీడియాతో మాట్లాడారు. ఇదిలా ఉండగా మరోపక్క ఇన్ని రోజుల నుంచి ఓ ఐఏఎస్ అధికారి స్థాయిలో విచారణ చేపట్టినా నిజానిజాలు బయటికి రాకపోవడానికి కారణం ఏంటని నియోజకవర్గం ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా మరో రెండు రోజుల్లో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయి.

