కలం, ఆదిలాబాద్ : రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులకు భరోసా కల్పించాలనే లక్ష్యంతో నవంబర్ 1న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రైతు గర్జన సభ (Rythu Garjana Sabha) నిర్వహిస్తున్నట్లు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. గురువారం సభ ఏర్పాట్లకు మాజీ మంత్రి జోగు రామన్న, మాజీ విప్ బాల్క సుమన్, యువ నాయకుడు భార్గవ్ దేశ్‌పాండేతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వ్యవసాయ రంగంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. రైతుల ఆత్మహత్యలను నివారించి, వారిలో ఆత్మవిశ్వాసం నింపడంతో పాటు రైతుల సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రైతు గర్జన సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్న నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.
రైతు గర్జన సభకు రైతులు, ప్రజలు స్వచ్ఛందంగా హాజరవుతామని ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. నవంబర్ 1న ఆదిలాబాద్ జిల్లా గులాబీమయం కాబోతుందనే విషయం ప్రజల స్పందనతో స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. రైతు గర్జన సభను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని, సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు.

