కలం, చండ్రుగొండ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో(Chandrugonda Mandal) తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉపాధి కోసం వలస వచ్చిన ఓ నిరుపేద కుటుంబంలో విద్యుత్ ప్రమాదం తీరని విషాదాన్ని నింపింది. ఇనుప తీగపై బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ ప్రసారం కావడంతో ఓ వివాహిత మృతి చెందింది. చండ్రుగొండ మండలం పోకలగూడెం గ్రామ పరిధిలోని ధర్మసోత్ హరియాకు చెందిన శ్రీ వెంకటేశ్వర బ్రిక్స్ కంపెనీ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఒడిశా రాష్ట్రం మల్కానగిరి జిల్లా కరిపుట్ మండలం సిక్ఫల్లికి చెందిన బాలు అర్జున్, బాల రాజమణి (27) దంపతులు ఉపాధి కోసం గత ఆరు నెలలుగా ఇటుక బట్టీ వద్ద పనిచేస్తూ అక్కడే నివసిస్తున్నారు.
బుధవారం అర్జున్ భార్య బాల రాజమణి ఉతికిన బట్టలను ఇనుప తీగపై ఆరేస్తుండగా, అనుకోకుండా ఆ తీగకు విద్యుత్ ప్రసారమైంది. దీంతో ఆమె తీవ్ర విద్యుత్ షాక్కు గురయ్యారు. కూతురు ప్రమాదంలో చిక్కుకోవడం గమనించిన తండ్రి దీనబంధు ఆమెను రక్షించేందుకు ప్రయత్నించగా, ఆయనకు కూడా విద్యుత్ షాక్ తగిలి కిందపడిపోయారు. అయితే, దీనబంధుకు స్వల్ప గాయాలు కావడంతో ప్రాణాపాయం తప్పింది. తీవ్రంగా గాయపడిన బాల రాజమణి మాత్రం అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ఆకస్మిక ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. సమాచారం అందుకున్న చండ్రుగొండ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి భర్త బాలు అర్జున్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉపాధి కోసం సుదూర ప్రాంతం నుంచి వచ్చి, కళ్ల ముందే కన్నకూతురిని కోల్పోవడంతో తల్లిదండ్రులు, భర్త కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరు అక్కడివారిని కలచివేసింది.

