కలం, యాదగిరిగుట్ట: ఆలయాల పరిరక్షణ, దేవాదాయ భూముల సంరక్షణ, అర్చకులు–ఆలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం.. లక్ష్యాలుగా బీజేపీ ఎండోమెంట్ విభాగం ఆలేరు నియోజకవర్గంలో కొత్త బాధ్యతలకు శ్రీకారం చుట్టింది. ఈ విభాగం ఆలేరు అసెంబ్లీ కన్వీనర్‌గా కళ్లెం శ్రీనివాస్ గౌడ్ (Kallem Srinivas Goud ) నియమితులయ్యారు. బుధవారం జిల్లా కన్వీనర్ సురకంటి జంగారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.
ఆలయ భూములపై ప్రత్యేక దృష్టి!
నూతన కన్వీనర్‌గా బాధ్యతలు స్వీకరించిన కళ్లెం శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలోని దేవాలయాల పరిరక్షణతో పాటు ధూపదీప నైవేద్యాల నిర్వహణ, అర్చకులు, ఆలయ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడటం, హిందూ ధార్మిక సంస్థల ప్రయోజనాలను పరిరక్షించడం తన ప్రాధాన్య అంశాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎండోమెంట్ సెల్ కన్వీనర్ సూర్య ప్రకాష్, రాష్ట్ర జాయింట్ కన్వీనర్ రంగ రామ గౌడ్, బీజేపీ నాయకులు లెంకలపల్లి శ్రీనివాస్, నేరేళ్ల సంతోష్, కోల విక్రమ్, గుజ్జ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

