కలం, కరీంనగర్: విలీన గ్రామాలు, శివారు ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ (Kolagani Srinivas) తెలిపారు. నగరపాలక సంస్థ అభివృద్ధిలో భాగంగా బుధవారం 20, 43, 60వ డివిజన్లలో పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
మొదటగా 20వ డివిజన్ రేకుర్తిలో స్థానిక కార్పొరేటర్లు పర్వతం మల్లేశం, సుధగోని మాధవి కృష్ణ గౌడ్‌తో కలిసి నగరపాలక సంస్థ సాధారణ నిధులు రూ.61 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అనంతరం 60వ డివిజన్ కాశ్మీర్ గడ్డలో డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కార్పొరేటర్ నస్రీమ్ సుల్తానాతో కలిసి యూఐడీఎఫ్ నిధులు రూ.40 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులను ప్రారంభించారు. 43వ డివిజన్ గోదాంగడ్డలో డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కార్పొరేటర్ పొన్నం లక్ష్మీ మొండయ్యతో కలిసి రూ.14 లక్షల సాధారణ నిధులతో చేపట్టనున్న డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు.అనంతరం ఆయా డివిజన్లలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించి, త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ గతంలో నగరంలో విలీనమైన గ్రామాలు, శివారు ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆయా ప్రాంతాల అభివృద్ధికి దశలవారీగా నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. రేకుర్తిలో నగరపాలక సంస్థ సాధారణ నిధులు, సుడా నిధులతో పలు పనులు చేపట్టామని, కొన్ని పూర్తికాగా మరికొన్ని పురోగతిలో ఉన్నాయని వివరించారు. విలీన గ్రామాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అమృత్ 2.0 పథకం కింద ప్రతి కాలనీలో పైపులైన్ల నిర్మాణ పనులు చేపట్టామని, త్వరలోనే తాగునీరు అందిస్తామని తెలిపారు.
గ్లోబల్ వార్మింగ్, ఎల్ నినో ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని, భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మేయర్ సూచించారు. నగరపాలక సంస్థ సరఫరా చేసే నీటిని పొదుపుగా వాడుకోవాలని, ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు నిర్మించుకుని వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నగరపాలక సంస్థ కూడా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్‌కు చర్యలు చేపడుతోందని తెలిపారు.
కరీంనగర్‌ను తెలంగాణలోనే అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సలహాలు, సూచనల మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని మేయర్ పేర్కొన్నారు. నగర అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఆథీనా, మాజీ కార్పొరేటర్లు అంజుమ్ బర్కత్ అలీ, శ్రీదేవి చంద్రమౌళి, డీఈ ఓం ప్రకాష్, ఏఈ గట్టు స్వామి, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

