కలం, వెబ్డెస్క్: సర్ ప్రక్రియపై సుప్రీం కోర్ట్ (Supreme Court) ఎన్నికల సంఘానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ల ఫారమ్ 6, 8 దరఖాస్తులకు గడువు పెట్టొద్దని కోర్ట్ స్పష్టం చేసింది. ఢిల్లీ (Delhi) లో జరుగుతున్న సర్ ప్రక్రియపై దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్ట్ బుధవారం విచారించింది. ఈ సందర్భంగా ఇప్పటికే 2026 ఓటర్ల జాబితాలో పేరున్న వారు, కొత్త ఓటర్ల కోసం కేటాయించిన ఫారం-6ను ఎందుకు సమర్పించాలని కోర్టు నిలదీసింది. ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించలేకపోయిన పాత ఓటర్ల నుంచి కొత్త ఓటర్లుగా నమోదు కావాలని ఈసీ సూచించడంపై కోర్ట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అంశంపై రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
తాత్కాలికంగా వేరే ప్రాంతాలకు వెళ్లడాన్ని నివాసం మారినట్లు పరిగణించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. కేవలం కొద్ది నెలలు పని నిమిత్తం బయటకు వెళ్లినంత మాత్రాన ఓటు హక్కును కోల్పోరని, ఎన్యూమరేషన్ ఫారం ఇవ్వలేదన్నంత మాత్రాన శాశ్వతంగా ఓటు హక్కు తొలగించడం సరికాదని అభిప్రాయపడింది. నివాసం మారిన ఓటర్లు ఫారం-8 ఉపయోగించే అవకాశం కల్పించాలని, అంతే తప్ప తాము ఎప్పుడూ ఓటరుగా నమోదు కాలేదంటూ ఫారం-6 కింద తప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలని కోరడం తగదని కోర్టు (Supreme Court) పేర్కొంది.
ఢిల్లీలో ఉన్న వలసదారులు, దినసరి కూలీల సౌలభ్యం కోసం జాబితాలను స్థానిక భాషల్లో అందుబాటులో ఉంచాలని సూచించింది. జాబితాలో మార్పుల కోసం ఓటర్లు నిరంతరం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం గడువు పొడిగించనున్నట్లు తెలిపింది.
Also Read : కెనడా ఓపెన్ నుంచి అనహత్ సింగ్ ఔట్!
Follow Us On : WhatsApp

