ముగిసిన సర్.. తుది ఓటరు జాబితా రిలీజ్!

కలం, నేషనల్ డెస్క్ : కర్నాటకలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR‌‌) ప్రక్రియ పూర్తయింది. సర్‌‌పై దేశవ్యాప్తంగా వివాదం కొనసాగుతున్న వేళ కర్నాటక ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం మంగళవారం తుది ఓటర్ల జాబితా (Karnataka Voters List)ను విడుదల చేసింది. ఇందులో రాష్ట్ర ఓటర్ల సంఖ్య గతంతో పోలిస్తే సుమారు కోటి వరకు తగ్గింది. సవరణకు ముందు 5,54,32,314 మంది ఓటర్లు ఉండగా.. తుది జాబితాలో 4,55,00,011 మంది పేర్లు మాత్రమే ఉన్నాయి. అంటే రెండు జాబితాల మధ్య ఓటర్ల సంఖ్యలో దాదాపు 99.32 లక్షల తేడా ఉంది. ఈసీ గణాంకాల ప్రకారం.. సవరణ సమయంలో కోటికి పైగా ఎన్యుమరేషన్‌ ఫారాలను పరిగణనలోకి తీసుకోలేదు.

ఇందులో కొన్ని సమర్పించనివి కూడా ఉన్నాయి. ముసాయిదా జాబితా తర్వాత చేపట్టిన ప్రక్రియలో కొత్తగా పేర్లు చేర్చడం, తొలగించడం, వివరాలను సవరించడం వంటి మార్పులతో ఈ తుది జాబితాను రూపొందించారు. ఇందులో 2,25,40,493 మంది పురుషులు, 2,29,12,355 మంది మహిళలు, 2,841 మంది థర్డ్‌ జెండర్‌ ఓటర్లు ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. 18–19 ఏళ్ల వయసు గల యువ ఓటర్లు 6.83 లక్షల మందికి పైగా ఉండగా, 85 ఏళ్లు పైబడిన ఓటర్లు 3.92 లక్షలకు పైగా ఉన్నారు.

తుది జాబితాకు ముందు..

సర్‌‌ సవరణకు ముందు కర్నాటకలో 5,54,32,314 మంది ఓటర్లు ఉన్నారు. ముసాయిదా జాబితా విడుదలయ్యే సమయానికి ఈ సంఖ్య 4,46,35,975కు తగ్గింది. అంటే 1,07,96,339 మంది ఓటర్ల వివరాలు ఆ జాబితాలో లేవు. వీరిలో శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వెళ్లినవారు 65,45,679 మంది, అందుబాటులో లేనివారు 19,00,926, మరణించినవారు 16,39,864, ఇతర ప్రాంతాల్లోనూ పేర్లు నమోదైనవారు 7,09,870 మంది ఉన్నట్లు ముసాయిదా జాబితా గణాంకాలు వెల్లడించాయి. ఈ జాబితాపై అభ్యంతరాలు, కొత్తగా పేర్లు చేర్చేందుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అనేక మార్పులు చేశారు.

ఈ ప్రక్రియలో 10,08,038 మంది పేర్లు చేర్చగా, 1,88,324 మంది పేర్లను తొలగించారు. మరో 8,96,519 మంది ఓటర్ల వివరాలను సవరించారు. దీంతో ముసాయిదా జాబితాతో పోలిస్తే తుది జాబితాలో ఓటర్ల సంఖ్య నికరంగా 8,64,036 పెరిగింది. ఈ పెరుగుదల ఉన్నప్పటికీ, సవరణకు ముందు ఉన్న సంఖ్యతో పోలిస్తే తుది జాబితాలో 99,32,303 మంది ఓటర్ల సంఖ్య తగ్గింది.

43.82 లక్షల మందికి నోటీసులు

ఓటర్ల వివరాల్లో సందేహాలున్న 43,82,824 మందికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. వీరందరికీ సంబంధించిన విచారణ పూర్తయిందని ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపింది. అనంతరం 61,867 మందిని తుది జాబితాలో చేర్చేందుకు అనర్హులుగా గుర్తించారు. కొత్త ఓటర్ల నమోదుకు ఉపయోగించే ఫారం-6 ద్వారా 8,77,104 మందిని, విదేశాల్లో నివసించే భారతీయుల నమోదు కోసం ఉపయోగించే ఫారం-6ఏ ద్వారా 2,312 మందిని చేర్చారు. అడ్రస్‌ మార్పులకు సంబంధించిన ఫారం-8 ద్వారా మరో 1,28,622 మందిని చేర్చినట్లు అధికారులు వెల్లడించారు.

ఓటర్ల రక్షణ మా బాధ్యత

కోటిమంది ఓటర్ల పేర్లు డిలీట్‌ కావడంతో కర్నాటక సీఎం డీకే శివకుమార్ మంగళవారం తీవ్రంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అర్హులైన ఓటర్ల హక్కులను కాపాడటమే తమ ప్రథమ బాధ్యత అని స్పష్టం చేశారు. ఏ ఒక్క నిజమైన ఓటరూ తమ ఓటు హక్కును కోల్పోకుండా తగిన రక్షణ కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. అయితే, ఈ భారీ స్థాయి ఓట్ల తొలగింపు ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తోంది. ముఖ్యంగా మైనారిటీలు, దళితులు, వెనుకబడిన వర్గాలు, పేదల ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందని కాంగ్రెస్‌ నేతలు గతంలో ఆరోపించారు.

భారీ సంఖ్యలో ఫారం–7 దరఖాస్తులు సమర్పించి ఓటర్ల పేర్ల తొలగింపునకు ప్రయత్నాలు జరిగాయని సీఎం డీకే శివకుమార్‌ అన్నారు. మరోవైపు, సర్‌‌కు వ్యతిరేకంగా నవంబరు 1న ఢిల్లీలో జరిగే ఇండియా కూటమి నిరసన కార్యక్రమంలో కర్నాటక నుంచి ఐదు వేల మంది పాల్గొనేలా కాంగ్రెస్‌ ఏర్పాట్లు చేస్తోంది. బెంగళూరులోనూ నవంబరు 5న నిరసన నిర్వహించనున్నట్లు కాంగ్రెస్‌ నేతలు ఇప్పటికే ప్రకటించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>