కలం, ఖమ్మం బ్యూరో : మంగళవారం రాత్రి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాను వణికిస్తున్న ‘అర్నబ్ తుఫాన్’ (Arnab Cyclone) ప్రభావం తీవ్రతరమవుతోంది. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రానున్న 36 గంటలు అత్యంత కీలకంగా మారడంతో అధికార యంత్రాంగం జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించింది. ప్రజల ప్రాణరక్షణే ప్రథమ ప్రాధాన్యతగా భావిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్, ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్ యుద్ధప్రాతిపదికన ముందస్తు చర్యలు చేపట్టారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో విద్యార్థులు, సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు నేడు (బుధవారం) ఒక్క రోజు సెలవు ప్రకటిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సెలవులు ప్రకటించాలని ఆదేశాలు వెలువడ్డాయి.
విపత్తు నిర్వహణను అత్యంత సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం, జిల్లా మండల స్థాయి అధికారులకు మంజూరు చేసిన సెలవులన్నింటినీ రద్దు చేసింది. ఏ ఒక్క అధికారి కూడా అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్‌ను విడిచి వెళ్లరాదని, ఎల్లప్పుడూ క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న గ్రామాలు, వాగులు, వంకలు, పాత వంతెనల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రమాదకర మార్గాలలో రాకపోకలను నిలిపివేయడానికి బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఇంద్రావతి, తాలిపేరు పరివాహక ప్రాంతాలతో పాటు చెరువులు, సాగునీటి ప్రాజెక్టుల వద్ద నీటిమట్టాలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
అత్యవసర సహాయక చర్యల కోసం ఛాతకొండలో ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాన్ని, భద్రాచలంలో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాన్ని రంగంలోకి దించారు. రహదారులపై చెట్లు కూలితే వెంటనే తొలగించేందుకు సిబ్బందిని, యంత్రాలను సిద్ధం చేశారు. మరోవైపు, రానున్న రోజుల్లో ప్రసవాలు జరిగే గర్భిణులను ముందస్తుగానే సమీప ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించాలని, 108 వాహనాలను ఎప్పుడూ అందుబాటులో ఉంచాలని వైద్య శాఖను ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లోకి రాకపోకలు, గనుల ప్రాంతాలు, చేపల వేట, పడవ ప్రయాణాలు, నదులలో ఈత వంటి ప్రమాదకర కార్యకలాపాలపై కఠిన ఆంక్షలు విధించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించేలా ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను అప్రమత్తం చేశారు.
ప్రజలకు ఎలాంటి అత్యవసర సహాయం కావాలన్నా, వరదలు లేదా ప్రమాదాలు ఎదురైనా సంప్రదించేందుకు వీలుగా అధికార యంత్రాంగం ప్రత్యేక నంబర్లను అందుబాటులో ఉంచింది. ఫైర్ ఆఫీసర్ క్రాంతి (87126 99523), కొత్తగూడెం ఆర్డీవో డి. మధు (93929 19715), భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ఠ (93929 19716), అలాగే కొత్తగూడెం ఐడీఓసీ కంట్రోల్ రూమ్ (93929 19743) నంబర్లను సంప్రదించాలని సూచించారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందకుండా, అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా, అధికారులు జారీ చేసే హెచ్చరికలను తూచా తప్పకుండా పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేస్తోంది.

