ఎల్ నినో ముప్పు.. ఫామ్‌హౌస్‌‌ లోనే ప్రతిపక్ష నేత!

కలం, తెలంగాణ బ్యూరో: “ఎల్‌ నినో.. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు..” అంటూ బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు పదేపదే ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నారు. ప్రజలకు ధైర్యం చెప్పడానికి బదులు భయభ్రాంతులకు గురయ్యేలా తీవ్ర స్థాయిలోనే వ్యాఖ్యలు చేశారు. ‘ఇలాంటి టైమ్‌లో కేసీఆర్ (KCR) ఉంటే..’ అంటూ కొన్ని కామెంట్లు కూడా చేశారు. విమర్శలపై మాత్రమే దృష్టిపెట్టిన వీళ్లిద్దరూ.. ప్రభుత్వం నుంచి ప్రజలకు అందాల్సిందేంటో ప్రస్తావించడం లేదు.

రాష్ట్రంలో రైతాంగానికి సాగునీరు అందక, వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అందక పంటలు ఎండిపోతూ ఉంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఫామ్‌హౌస్‌ దాటి బయటకు రాకపోవడాన్ని, పార్టీ అధినేతగా ప్రకటన చేయకపోవడాన్ని ప్రజలు జీర్ణించుకోవడం లేదు. అధికారంలో ఉన్న సమయంలో కరోనా వచ్చినప్పుడు ముందు జాగ్రత్తలు చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ప్రజలు గుర్తుండరా? అనే ప్రశ్నలు జనం నుంచి వినిపిస్తున్నాయి.

గంభీర ప్రకటనలకే పరిమితం

రాష్ట్రానికి, ప్రజలకు నష్టం జరుగుతున్నప్పుడు ఊరుకునే ప్రసక్తే లేదని, నిలదీస్తామంటూ పలు సందర్భాల్లో కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని 350కి పైగా మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. కేంద్రం నుంచి సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. ఇలాంటి సందర్భంలో కేంద్రం నుంచి సాయం అందే విషయంలో బీఆర్ఎస్ (BRS) నేతలు గానీ, కేసీఆర్‌ గానీ స్పందించకపోవడం గమనార్హం.

రాష్ట్ర రైతాంగం పంటలు నష్టపోతుండగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని, బాధితులను గుర్తించాలని, పంటలు ఎండిపోయిన ప్రతీ ఎకరానికి నష్టపరిహారం ఇవ్వాలని.. ఇలాంటివేవీ వీరు ప్రస్తావించడం లేదు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, ప్రజలను పట్టించుకోకుండా గాలికొదిలేసిందని, ముందు జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదంటూ కేటీఆర్, హరీశ్‌రావు తీవ్ర పదజాలంతో విమర్శలు చేస్తుంటే.. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల తరఫున గొంతెత్తి కేసీఆర్ ఎలాంటి సూచనలు చేయకపోవడం చర్చకు దారితీసింది.

విమర్శలు సరే.. బాధ్యత ఏదీ?

ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపడంతో పాటు ఎల్‌ నినో (El Nino) కారణంగా రాష్ట్రంలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు, తాగునీటి ముప్పు పొంచి ఉన్న సమయంలో ప్రజలు పాటించాల్సిన పొదుపు చర్యలపైనా, రైతులకు తాత్కాలిక ఊరటనిచ్చే మార్గాలపైనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ (KCR) తనవంతు బాధ్యతను నిర్వర్తించాల్సి ఉన్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేటీఆర్, హరీశ్‌రావు చేస్తున్న విమర్శలన్నీ రాజకీయ ప్రయోజనాలతో ముడిపడిన అంశాలుగానే ఉంటున్నాయి.

కరోనా టైమ్‌లో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఇచ్చిన ముందు జాగ్రత్త సూచనల్లాంటివి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఎందుకు ఇవ్వట్లేదనే చర్చ మొదలైంది. కరోనా గడ్డు పరిస్థితుల్ని కేసీఆర్ దీటుగా ఎదుర్కొన్నారని గొప్పగా చెప్పుకుంటున్న కేటీఆర్, హరీశ్‌రావు.. ఇప్పుడు ఎల్‌నినో సమయంలో కేసీఆర్ చేత చెప్పించాలనే అంశాన్ని ఎందుకు విస్మరించారన్నది కూడా చర్చనీయాంశమైంది. ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సంక్షేమ బాధ్యత పట్టదా? అనేది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది.

రాజకీయ ప్రయోజనాలపైనే దృష్టి

కేటీఆర్, హరీశ్‌రావుకు బదులుగా పార్టీ అధినేతగా కేసీఆర్ వాయిస్ ప్రజల్లోకి బలంగా వెళ్తుందనేది ఆ పార్టీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఇబ్బందుల్లో ఉన్న రైతులకు ఊరటనిచ్చేలా, ఓదార్పు అందించేలా పార్టీ తరఫున ఒక్క యాక్టివిటీ కూడా లేదని, ప్రభుత్వం ఫెయిల్ అయిందంటూ విమర్శలు చేస్తున్న సమయంలో ప్రజలవైపు నిలబడ్డామని గట్టిగా చెప్పుకోడానికి ఒక్క కార్యక్రమాన్ని కూడా నాయకత్వం తీసుకోకపోవడాన్ని ప్రస్తావించారు.

ఎల్‌ నినోపై కేసీఆర్ నుంచి ప్రకటన రాకపోవడం పార్టీకి ప్రజల్లో నష్టమే చేస్తుందన్నారు. ప్రభుత్వం విఫలమైందన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా వ్యవహరించామనే సందేశం ప్రజల్లోకి వెళ్లలేదు కదా! అని గుర్తుచేశారు. ప్రత్యామ్నాయ రోడ్‌మ్యాప్‌ను ప్రజల ముందు ఉంచడంలో బీఆర్‌ఎస్ విఫలమైందని అభిప్రాయపడ్డారు. సంక్షోభ సమయంలోనూ ప్రజల పక్షాన నిలబడకుండా, కేవలం రాజకీయ పోరాటాలకే పరిమితమైతే ప్రభుత్వంతో పాటే ప్రతిపక్షాన్ని తప్పుపడతారని వ్యాఖ్యానించారు.

ఎల్‌ నినో, దాని వెన్నంటి కరువు ఒక ప్రకృతి వైపరీత్యమంటూ కేంద్ర ప్రభుత్వం, పలు రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నందున.. మీడియా సమావేశాల్లో ఘాటు విమర్శలు, ప్రభుత్వంపై ఆరోపణలకే పరిమితం కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలను చైతన్యపరచడం, పొదుపు చర్యలకు పిలుపునివ్వడం, ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడం ప్రధాన ప్రతిపక్షానికి ఉండే బాధ్యతల్లో ఒకటి అని గుర్తుచేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>